అస్సాంలో బాలికపై గ్యాంగ్ రేప్

  • ట్యూషన్​ నుంచి వస్తుండగా దాడి చేసి అత్యాచారం
  • అనంతరం చెరువు వద్ద వదిలి పరారైన ముగ్గురు వ్యక్తులు
  • పెద్ద సంఖ్యలో రోడ్లమీదికొచ్చి నిరసన తెలిపిన ప్రజలు

గౌహతి: ట్యూషన్​కు వెళ్లి తిరిగి వస్తున్న 14 ఏండ్ల అమ్మాయిపై ముగ్గురు దుండగులు దాడి చేశారు. ఎవరూలేని చోటుకు తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం బాధితురాలిని ఊరి బయట చెరువు దగ్గర వదిలేసి పరారయ్యారు. అస్సాంలోని నాగోన్ జిల్లాలో గురువారం రాత్రి ఈ దారుణం జరిగింది. 

అమ్మాయి కండిషన్ సీరియస్.. 

డింగ్ గ్రామానికి చెందిన బాలిక గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ట్యూషన్ నుంచి ఇంటికి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. ఊరి చివర చెరువు దగ్గరికి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను అక్కడే వదిలి పారిపోయారు. చిరిగిన బట్టలతో సొమ్మసిల్లి పడిఉన్న బాధితురాలిని స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి వాంగ్మూలం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి సీరియస్​గా ఉన్నట్లు ఆస్పత్రివర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. రోడ్లమీదికొచ్చి ర్యాలీలు తీశారు. దీంతో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.

కఠిన చర్యలు తప్పవు:  సీఎం హిమంత

నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ స్పష్టం చేశారు. గడిచిన రెండు నెలల్లో మహిళలపై ఇలాంటి 22 ఘోరాలు జరిగాయని ఆందోళన వ్యక్తంచేశారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని డీజీపీని ఆయన ఆదేశించారు.