జీఎస్టీ పరిహారం కింద 8వ ఇన్‌స్టాల్‌మెంట్ రిలీజ్ చేసిన ఆర్ధికశాఖ
న్యూఢిల్లీ: జీఎస్‌టీ కాంపన్సేషన్ కింద రాష్ట్రాలకు ఎనిమిదో వీక్లీ ఇన్‌స్టాల్‌మెంట్ రూ. 6 వేల కోట్లను ఫైనాన్స్ మినిస్ట్రీ సోమవారం రిలీజ్ చేసింది. ఈ అమౌంట్‌తో కలిపి కాంపన్సేషన్ కింద ఇప్పటి వరకు రూ. 48 వేల కోట్లను రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చింది. ఈ రూ. ఆరు వేల కోట్లలో రూ. 5,516.60 కోట్లు 23 రాష్ట్రాల కోసం విడుదల చేయగా, మిగిలిన రూ. 483.40 కోట్లను ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్, పుదుచ్చెరిల కోసం రిలీజ్ చేసింది. మిగిలిన ఐదు రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, సిక్కింలకు జీఎస్‌టీని అమలు చేయడం వలన ఎటువంటి రెవెన్యూ గ్యాప్ రాలేదని ఫైనాన్స్ మినిస్ట్రీ ఓ స్టేట్‌మెంట్‌లో తెలిపింది. జీఎస్‌టీని అమలు చేయడం వలన ఏర్పడిన రూ. 1.10 లక్షల కోట్ల రెవెన్యూ కొరతను చేరుకునేందుకు ఓ స్పెషల్ బారొవింగ్ విండోను ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రాల తరపున కేంద్రమే ఈ విండో ద్వారా అప్పులు చేసి అమౌంట్‌ను రిలీజ్ చేస్తోంది. ఇప్పటి వరకు అక్టోబర్ 23, నవంబర్ 2, నవంబర్ 9, నవంబర్ 23, డిసెంబర్ 1, డిసెంబర్ 7, డిసెంబర్ 14, డిసెంబర్ 21 తేదీలలో అమౌంట్‌ను రాష్ట్రాల కోసం కేంద్రం విడుదల చేసింది. ఈ వారం ఇన్‌స్టాల్‌మెంట్‌ను 4.19 % వడ్డీ వద్ద కేంద్రం అప్పు చేసింది.
