శాసన సభలో గందరగోళం.. రికార్డుల నుండి ఏలేటి వ్యాఖ్యలు తొలగింపు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో స్వల్ప గందరగోళం నెలకొంది. ఇటీవల మరణించిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‎కు సంతాపం తెలిపేందుకు తెలంగాణ అసెంబ్లీ సోమవారం (డిసెంబర్ 30) ప్రత్యేకంగా భేటీ అయ్యింది. మన్మోహన్ సింగ్‎కు భారత రత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై నిర్మల్ ఎమ్మెల్యే, బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. 

భారత మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహా రావు అంత్యక్రియలను కాంగ్రెస్ గౌరవప్రదంగా నిర్వహించలేదని.. ఆయనకు భారత రత్న ఇవ్వకుండా కాంగ్రెస్ అవమానించిందని మహేశ్వర్ రెడ్డి అన్నారు. కానీ పీవీ సేవలను మోడీ సర్కార్ గుర్తించి భారత రత్నతో గౌరవించిందని.. అలాగే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించడమే కాకుండా.. మన్మోహన్ సింగ్ స్మారక స్థూపానికి స్థలం కేటాయిస్తామని ప్రధాని మోడీ చెప్నారన్నారు ఏలేటీ. కాంగ్రెస్ పీవీకి ఇవ్వని గౌరవం బీజేపీ మన్మోహన్ సింగ్‎కు కల్పించిందని అన్నారు. 

ఈ క్రమంలో ఏలేటీ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ సంతాపం తీర్మానంపై చర్చ సందర్భంగా ఏలేటి రాజకీయ ప్రసంగాలు ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సైతం మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను సభ రికార్డుల నుండి తొలగించాలని శ్రీధర్ బాబు స్పీకర్‎ను కోరారు. దీంతో ఏలేటి వ్యాఖ్యలను పరిశీలించిన స్పీకర్.. సభ రికార్డుల నుండి ఆయన వ్యాఖ్యలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. 

2024, డిసెంబర్ 26వ తేదీన అనారోగ్యంతో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన విషయం తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించడంతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన సింగ్‎కు సంతాపం తెలపాలని తెలంగాణ అసెంబ్లీ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ప్రత్యేకంగా తెలంగాణ అసెంబ్లీ భేటీ అయ్యి.. మన్మోహన్ సింగ్‎కు నివాళుర్పించారు సభ్యులు.