దారితప్పిన ఇరిగేషన్​ను గాడిలో పెడ్తున్నం : మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

  • 22 వేల కోట్ల బడ్జెట్​లో 11 వేల కోట్లు అప్పులకే పోతున్నయ్: ఉత్తమ్​
  • నెలాఖరులోపు ఉద్యోగుల ప్రమోషన్లు, ట్రాన్స్​ఫర్ల ప్రక్రియ పూర్తి
  • ఏఈఈ అసోసియేషన్​ డైరీని ఆవిష్కరించిన మంత్రి ​

 హైదరాబాద్, వెలుగు: గత సర్కారు ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ను సర్వనాశనం చేసిందని.. పదేండ్లలో దారితప్పిన శాఖను గాడిలో పెడుతున్నామని ఆ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అన్నారు. ఇరిగేషన్​ ప్రాజెక్టులపై గత ప్రభుత్వం తక్కువ కాలపరిమితితో ఎక్కువ వడ్డీలకు తీసుకున్న లోన్లను.. తక్కువ వడ్డీ ఎక్కువ కాలపరిమితితో కూడిన లోన్లుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇరిగేషన్​ శాఖ బడ్జెట్​రూ.22 వేల కోట్లలో.. రూ.11 వేల కోట్లు అప్పులకే పోతున్నాయన్నారు.

బుధవారం జలసౌధలో అసోసియేషన్​ ఆఫ్​ తెలంగాణ అసిస్టెంట్​ఎగ్జిక్యూటివ్​ ఇంజనీర్స్​ డైరీని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోపు డిపార్ట్​మెంట్​లో ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్​ దాస్​, ముఖ్య కార్యదర్శి రాహుల్​ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్​ జీవన్​ పాటిల్, ఈఎన్​సీ జనరల్​ అనిల్​ కుమార్, ఈఎన్​సీ ఓ అండ్​ ఎం విజయభాస్కర్​ రెడ్డితో ఫైవ్​మెన్​ కమిటీ వేశామని, వారు న్యాయపరమైన ఇబ్బందులను అధిగమించి సమస్యలు రాకుండా ప్రమోషన్లు చేపడతామని తెలిపారు. 

సిబ్బంది నియామకంపై కసరత్తు..

ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​లో నియామకాలపై గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదని, తమ ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించిందని మంత్రి ఉత్తమ్​ తెలిపారు. 700 ఏఈఈలను నియమించామని, 1,800 మంది లష్కర్​లను ఔట్​సోర్సింగ్​పద్ధతిలో తీసుకున్నామని చెప్పారు. మరో 1,300 నియామకాలకు పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​కు అనుమతిచ్చామన్నారు. దానిపై ఫాలో అప్ చేయాల్సిందిగా ఈఎన్​సీ అనిల్​కు సూచించారు. దేశం మొత్తంలోనే తెలంగాణ ఇరిగేషన్​ శాఖకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు.

నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్​ వంటి ప్రాజెక్టులను కట్టిన చరిత్ర ఉందన్నారు. అటువంటి గొప్ప ఇంజనీర్లకు వారసులుగా యువ ఇంజనీర్లు ఎదగాలని, అందుకు అనుగుణంగా కష్టపడాలని చెప్పారు. డ్యూటీలో సిన్సియారిటీ, నిబద్ధత, పారదర్శకతతో పనిచేయాలన్నారు. యువత కచ్చితంగా ఫీల్డ్​లోనే పనిచేయాలని, కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు సాధించిన వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని చెప్పారు. కారణం లేకుండా వేరే చోటుకు బదిలీ కావాలని పైరవీలకు ప్రయత్నిస్తే.. గతంలో సీఎం చెప్పినట్టు అడవుల్లోకి వేస్తారని సున్నితంగా చెప్పారు.

మెడికల్​ గ్రౌండ్స్, అసాధారణ పరిస్థితులుంటే కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా, ఈ సందర్భంగా టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్​ రావు.. ఇంజనీర్ల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని ప్రాజెక్టుల వద్ద పాత క్వార్టర్స్​ శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటికి హెచ్​ఆర్​ఏ కట్​ చేస్తున్నారని చెప్పారు. ఎంతో కొంత రెంట్​ను ఫిక్స్​ చేసి హెచ్​ఆర్​ఏ కట్​ కాకుండా చూడాలన్నారు. మూడు నెలల నుంచి కొత్త ఏఈఈలకు జీతాల్లేవని, నాలుగేండ్లుగా టీఏ బిల్లులు పెండింగ్​లో ఉన్నాయని, రిటైర్డ్ ఎంప్లాయీస్​కు బెనిఫిట్స్​ పెండింగ్​ ఉన్నాయని చెప్పారు. అయితే, వాటిలో హెచ్​ఆర్​ఏ వంటి కొన్ని అంశాలనైనా పరిష్కరిస్తామని మంత్రి ఉత్తమ్​ హామీ ఇచ్చారు.