హుజూర్ నగర్​ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా : ఉత్తమ్ కుమార్ రెడ్డి

మేళ్లచెరువు(చింతలపాలెం), వెలుగు : హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మల్లారెడ్డిగూడెం నుంచి రామాపురం మీదుగా రేవూరు వరకు రూ.20 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.59 కోట్లతో ఆర్ అండ్ బీ రోడ్లను త్వరలో ప్రారంభిస్తామన్నారు. రూ.10 కోట్లతో చౌటుప్పల్ నుంచి మేళ్లచెరువు వరకు, రూ.26 కోట్లతో లింగగిరి నుంచి కల్మలచెరువు వరకు, రూ.23 కోట్లతో అమరవరం నుంచి అలింగాపురం వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

నియోజకవర్గంలో విద్య, వైద్యం, రోడ్లు వంటి మౌలిక వసతులకు నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలో యువతకు ఉపయోగపడేలా ఐటీఐ, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల నిర్మాణ పనులు చేపట్టినట్టు వివరించారు. హుజూర్ నగర్ లోని రామస్వామిగుట్ట వద్ద పేదల కోసం ఇండ్లను నిర్మిస్తున్నామన్నారు. జనవరి నాటికి పనులు పూర్తయ్యేలా నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, అర్హులకీ ఇండ్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఆర్ అండ్ బీ అధికారులు, ఇతర శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.