- టీజీకాబ్కు మంత్రి తుమ్మల ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రుణ మాఫీ కింద లబ్ధి పొందిన రైతులకు త్వరితగతిన కొత్త పంట రుణాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ సహకార బ్యాంకు (టీజీకాబ్)కు సూచించారు. ఆదివారం టీజీ కాబ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి సహకార బ్యాంక్ పనితీరు, ఆర్థిక పరిస్థితిని మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీసీసీబీల్లో గతంలో కొంత మంది అధికారులు, పాలక వర్గాల నిర్లక్ష్యంతో కొన్ని తప్పులు జరిగాయని తెలిపారు.
అలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని మంత్రి సూచించారు. సహకార సంఘాలకు 2025 ప్రత్యేకమైనదని దానికి తగ్గట్టుగా అద్భుతమైన పనితీరు చూపి రైతుల పురోగతిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీకాబ్ న్యూ ఇయర్ క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీజీ కాబ్ అధ్యక్షుడు మార్నేని రవీందర్రావు, ఎండీ డాక్టర్ బి.గోపీ, కోఆపరేటివ్ డైరెక్టర్ ఉదయ్‌కుమార్, అడిషనల్ ఆర్ సీఎస్జి. శ్రీనివాసరావు, హైదరాబాద్ డీసీసీబీ అధ్యక్షుడు కొత్తకురుమ సత్తయ్య, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు అద్ధి భోజారెడ్డి , ఖమ్మం జిల్లా డీసీసీబీ అభ్యక్షుడు దొండపాటి వెంకటేశ్వరరావు, మహబూబ్‌నగర్ డీసీసీబీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తదితర జిల్లా అధ్యక్షులు, టీజీ కాబ్ డీజీఎం జ్యోతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.