పక్కా ప్లాన్​తో ఖమ్మం నగరాభివృద్ధి

  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన 


ఖమ్మం, వెలుగు: ఖమ్మం నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం  ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి 57 వ డివిజన్ రమణ గుట్టలో రూ.85 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, స్టార్మ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి పనులకు, రోడ్డుకు భూమి ఇచ్చిన స్థానికుడు మదన్ ను అభినందించారు. పేదలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, సంక్రాంతి నుంచి ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 

ఖమ్మం నగరంలో జనాభా పెరిగిందని,  పేదలు ఎక్కువగా ఉన్నారని, ఇక్కడ అధికంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని హౌసింగ్​ శాఖ మంత్రిని కోరినట్లు చెప్పారు. పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్​ కమిషనర్ ను కలవాలని సూచించారు. నగరానికి నీటి సరఫరా కోసం రూ.220 కోట్లతో అమృత్ పథకం కింద త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. 

ఇకపై ముంపు రాకుండా చర్యలు

ఖమ్మం నగరంలో వరదల కారణంగా ముంపు రాకుండా ఉండేందుకు రూ.250 కోట్లు మంజూరు చేసామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని తుమ్మల చెప్పారు. మున్నేరుకు రెండు వైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కొత్తగా ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సూచనల మేరకు డిజైన్​ లో మార్పులు, చేర్పులు ఉంటాయన్నారు. ఖమ్మంలో డంపింగ్ యార్డ్ రోడ్డు విస్తరణ కోసం రూ.కోటి 15 లక్షలు మంజూరు చేశామన్నారు. స్లాటర్ హౌస్ నిర్మాణానికి రూ.8 కోట్లు మంజూరు చేసామని తెలిపారు.  500 ఎకరాల్లో ఉన్న వెలుగుమట్ల అర్బన్ పార్కును నెహ్రూ జూలాజికల్ పార్క్ లాగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఖమ్మం ఖిల్లా దగ్గర రూ.20 కోట్లతో  రోప్ వే ఏర్పాటు చేసి, ఆహ్లాదంగా గడిపేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.  డివిజన్ల వారీగా అవసరమైన చోట కొత్త రోడ్లు, డ్రైయిన్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. 

అన్ని హామీలు అమలవుతున్నయ్.. 

ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ కు సంబంధించి ఎవరైనా అక్రమ నిర్మాణాలు, పారిశుధ్య నిర్వహణపై  ఫిర్యాదులు నమోదు చేసేందుకు మున్సిపల్ ఆఫీస్​ లో కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస్​రెడ్డి, కార్పొరేటర్లు ఎండీ రఫీదా బేగం, కమర్తపు మురళీ, అధికారులు పాల్గొన్నారు.