పామాయిల్ సాగుకు మాదీ భరోసా..లాభాలు రాకుంటే ఏ శిక్షకైనా సిద్ధం: మంత్రి తుమ్మల

  • ‘రైతు పండుగ’లో సీఎం రేవంత్ శుభవార్త చెప్తారని వెల్లడి

మహబూబ్​నగర్​, వెలుగు : రైతులు పామాయిల్ సాగు చేయాలని.. ఆ పంట ద్వారా లాభాలకు తాను భరోసా ఇస్తున్నునని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.  ఈ పంట సాగు వల్ల  రైతుల జీవితాల్లో వెలుగులు నిండకుంటే ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పారు. మహబూబ్​నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ‘రైతు పండుగ వ్యవసాయ ప్రదర్శన’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి చీఫ్ గెస్ట్​గా హాజరయ్యారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన 155 స్టాల్స్​ను పరిశీలించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో తుమ్మల మాట్లాడారు.

‘రైతులారా.. పామాయిల్​ సాగు చేయండి. మీ లాభాలకు మాదీ భరోసా. మొదటి మూడేండ్లు మీకు పెట్టుబడి పెట్టే బాధ్యత కూడా మాదే. అంతర్గత పంటలు వేస్తే, వాటికి కూడా బోనస్ చెల్లిస్తం. మీ పంటలను ఇండ్ల కాడే కొంటం. వెంటనే డబ్బులు చెల్లిస్తం. ఈ పంట సాగుకు కోతులు, దొంగలు, అడవి పందుల బాధ ఉండదు’ అని అన్నారు. అలాగే డ్రాగన్​ ప్రూట్, జాజ్, వక్కతో పాటు విభిన్న రకాల పంటలు సాగు చేయాలన్నారు. రాష్ట్రం అన్ని పంటలు సాగుచేసే స్థితికి ఎదగాలన్నారు. పంటలపై అవగాహన కల్పించేందుకు ఈ రైతు సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.

Also Read:-రెయిడ్​​కు వెళ్లిన ఈడీ టీమ్​పై ఎటాక్​..సైబర్ క్రైమ్ కేసులో నిందితుల దుశ్చర్య

సీఎం రేవంత్ రెడ్డి కోరిక మేరకు పాలమూరులో ఈ సదస్సులను ప్రారంభించామన్నారు. శనివారం జరగనున్న ‘రైతు పండుగ’ సభలో సీఎం రేవంత్​రెడ్డి.. ఈ నాలుగేండ్లలో రైతుల కోసం చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరిస్తారన్నారు. అలాగే వారికి శుభవార్త కూడా చెప్పనున్నారని తెలిపారు. భారీగా రైతులను సమీకరించి ‘రైతు పండుగ’ను విజయంతం చేయాలని పిలపునిచ్చారు.

రైతుల బాధలు కాంగ్రెస్​కు తెలుసు

‘‘రైతుల కష్టాలు, సాదకబాధకాలు కాంగ్రెస్​ ప్రభుత్వానికి తెలుసు. ప్రభుత్వం, నాయకుడు చిరస్థాయిగా నిలబడాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు రైతుకు సంబంధించినవి ఉండాలి. అలాంటి వ్యక్తి రేవంత్​ రెడ్డి. వ్యవసాయానికి 33 శాతం బడ్జెట్​ కేటాయించారు. ప్రతి ఏడాది చర్చా వేదికలను ఏర్పాటు చేసి, నిష్ణాతులైన రైతుల ద్వారా ఆధునిక మెలకువలు, సైంటిఫిక్ టెక్నిక్ తదితర వాటిపై అవగాహన కల్పించాలి’’  - మంత్రి దామోదర రాజనర్సింహ

వడ్లు అమ్మిన 3 రోజులకే డబ్బులు

‘‘ప్రభుత్వ కొనుగోలు సెంటర్​లో వడ్లు అమ్మిన మూడు రోజుల్లోనే రైతుల అకౌంట్లలో వాటికి సంబంధించిన డబ్బులు వేస్తున్నం. రైతులు సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల పెట్టుబడులు తగ్గి లాభాలు పెరుగుతాయి. దీనిపై ప్రదర్శనలో చాలా స్టాల్స్ ఏర్పాటు చేశాం. రైతులు వాటిని సందర్శించి స్ఫూర్తిని పొందాలి’’
– మంత్రి జూపల్లి కృష్ణారావు