సంక్రాంతి తర్వాత రైతు భరోసా

  • సాగు భూములకే పథకం వర్తింపు: మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
  • రైతుబంధులో కోతలు విధిస్తామని తాము  చెప్పలేదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిలో నమోదైన భూములన్నింటికీ రైతుబంధు ఇచ్చిందని, 12 సీజన్లకు రూ.80 వేల కోట్లకు పైగా చెల్లించిందని చెప్పారు. దీని వల్ల ఈ స్కీమ్‌‌ దుర్వినియోగం అయిందని, అందుకే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా విధివిధానాలపై సబ్ కమిటీ వేసి, రైతులు, ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నామన్నారు. 

ఇకపై సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. రైతు భరోసా గైడ్ లైన్స్‌‌పై ఇంకా సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని, ప్రతిపక్ష సభ్యులు కూడా తమ అభిప్రాయాలు చెప్పవచ్చన్నారు. మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఆమోదయోగ్యంగా ఉంటే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అంతే తప్ప తాము చెప్పిందే చేయాలనే ఆలోచన బీఆర్ఎస్ వాళ్లకు తగదన్నారు. పత్తి, చెరుకు పంటకు ఏం చేయాలన్నది సభ్యులు చెప్తే చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రైతు బంధులో కోతలు విధిస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని ఆయన వెల్లడించారు.