అప్పులకు వడ్డీలు కడుతూనే పథకాలు కొనసాగిస్తున్నాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ట్రిపుల్‌‌ ఆర్‌‌ వస్తే షాద్‌‌నగర్‌‌ భూములు బంగారమే..షాద్‌‌నగర్‌‌, వెలుగు : గత ప్రభుత్వం పదేండ్లలో రూ. 7 లక్షల కోట్ల అప్పు చేసిందని.. దానికి సంబంధించిన వడ్డీ కడుతూనే, మరో వైపు పథకాలు సైతం కొనసాగిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. బుధవారం షాద్‌‌నగర్‌‌లో నిర్వహించిన అగ్రికల్చర్‌‌ మార్కెట్‌‌ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 22 లక్షల మంది రైతులకు రూ. 18 వేల కోట్లు రుణమాఫీ చేశామని, పాలమూరులో జరిగే రైతు పండుగలో మరో రూ. 3 వేల కోట్ల మాఫీ చేయబోతున్నామన్నారు. 

బడ్జెట్‌‌లో వ్యవసాయరంగానికి రూ.47 వేల కోట్లు కేటాయించిన ఘనత సీఎం రేవంత్‌‌రెడ్డికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో వరి దిగుబడి ఆశాజనకంగా ఉందన్నారు. తెలంగాణలో పండిన బియ్యానికి మలేషియా, ఫిలిప్పీన్స్‌‌ దేశాల్లో మంచి డిమాండ్‌‌ ఉందని, బియ్యం ఎగుమతికి సంబంధించిన కసరత్తు జరుగుతుందన్నారు. పెండింగ్‌‌ ప్రాజెక్ట్‌‌లను పూర్తి చేసేందుకు సీఎం రేవంత్‌‌రెడ్డి పట్టుదలతో ఉన్నారన్నారు. ట్రిపుల్‌‌ ఆర్‌‌ పూర్తి అయితే షాద్‌‌నగర్‌‌ నియోజకవర్గంలోని భూములు బంగారం అవుతాయన్నారు. హైదరాబాద్‌‌కు అత్యంత చేరువలో ఉన్న షాద్‌‌నగర్‌‌ భవిష్యత్‌‌లో మంచి అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

అంతకుముందు మార్కెట్‌‌ కమిటీ చైర్‌‌పర్సన్‌‌గా సులోచన కృష్ణారెడ్డి, వైస్‌‌ చైర్మన్‌‌గా మహ్మద్‌‌ అలీఖాన్‌‌ బాబర్‌‌, మరికొందరు డైరెక్టర్లుగా ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్‌‌ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌‌, మాజీ ఎమ్మెల్యేలు చౌలపల్లి ప్రతాప్‌‌రెడ్డి, భీష్మ కిష్టయ్య, మాజీ జడ్పీటీసీలు తాండ్ర విశాల, వెంకట్రామిరెడ్డి, బాలరాజుగౌడ్‌‌, జగదీశ్వర్‌‌, తిరుపతి రెడ్డి, కాశీనాథ్‌‌రెడ్డి, రమాదేవి, చల్ల శ్రీకాంత్‌‌రెడ్డి పాల్గొన్నారు.