ఏదేమైనా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం: మంత్రి తుమ్మల

మహబూబ్ నగర్: రైతు రుణమాఫీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైమైనా ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రైతులకు రూ.2 లక్షల పంట రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించారు. కొన్ని సమస్యల వల్ల రుణమాఫీ వర్తించని వారిని గుర్తించి మళ్లీ రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు మహబూబ్ నగర్‎లో ప్రభుత్వం రైతు పండగ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా శనివారం (శనివారం 30) రైతు పండగ ముగింపు వేడుక నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. గత పదేళ్లలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ  చిన్నాభిన్నం అయ్యింది.. ఆర్థికంగా ఆగమైనా రాష్ట్రాన్ని మేం అధికారంలోకి వచ్చాక చక్కదిద్దుకుంటూ వస్తున్నామని తెలిపారు. గత బీ ఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్‎లో పెట్టిన రూ.7వేల కోట్ల రైతు భరోసాను మా ప్రభుత్వమే చెల్లించిందని చెప్పారు. బీఆర్ఎస్ పూర్తి చేయలేకపోయిన రుణమాఫీని కూడా మేమే పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్రంలో  వరి ధాన్యాన్ని పకడ్బందీగా కొనుగోలు చేస్తున్నామన్నారు.