ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రుణమాఫీ పూర్తి చేస్తాం: మంత్రి తుమ్మల

అలంపూర్, వెలుగు: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేసి తీరుతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి నాయకత్వంలో రైతులను కాపాడుకుంటామని చెప్పారు. అలంపూర్ మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఉండవెల్లి మండలం అలంపూర్‌‌‌‌‌‌‌‌ చౌరస్తా వద్ద వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌ యార్డులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు రూ. 18 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. 

తెల్ల కార్డు లేని మూడు లక్షల మంది రైతులకు ఈ నెల చివరి కల్లా రుణమాఫీ చేస్తామని చెప్పారు. రుణమాఫీ కోసం అనేక నిబంధనలు పెట్టామని ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని సూచించారు. రుణమాఫీ పూర్తయ్యాక రైతు భరోసాను కూడా విడుదల చేస్తామన్నారు. అలంపూర్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు మల్లమ్మకుంట రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేస్తామని చెప్పారు. అంతకుముందు జోగులాంబ బాలబ్రహ్మేంద్రస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా ఉప్పరి దొడ్డప్ప, వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా పచ్చర్ల కుమార్ ప్రమాణస్వీకారం చేశారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది కేసీఆరే...

గతంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నా 12 మందిని కొనుగోలు చేసి కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ కలిసి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వాన్ని పడగొడుతామంటూ గగ్గోలు పెడుతున్నారన్నారు. ఏదో కొంపలు మునుగుతున్నట్లు కేసీఆర్‌‌‌‌‌‌‌‌, హరీశ్‌‌‌‌‌‌‌‌రావు, కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రవర్తిస్తున్నారన్నారు. తాము ఏది చెబితే ప్రజలు అదే నమ్ముతారన్న భ్రమలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. 98 జీవో బాధితుల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.