పంటల బీమా స్కీమ్‌‌కు టెక్నాలజీ సహకారం అందించాలి : మంత్రి తుమ్మల

పంటల బీమా స్కీమ్‌‌కు  టెక్నాలజీ సహకారం అందించాలి : మంత్రి తుమ్మల
  •  అగ్రికల్చర్ యూనివర్సిటీకి మంత్రి తుమ్మల ఆదేశం

హైదరాబాద్, వెలుగు: పంటల బీమా పథకం అమలుకు సమగ్ర సాంకేతిక సహకారం అందించాలని అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రాష్ట్రంలో సాగవుతున్న పంటల వివరాలను అంచనా వేసేందుకు అగ్రికల్చర్‌‌‌‌ వర్సిటీ ప్రతిపాదించిన ప్రాజెక్టుపై శుక్రవారం సెక్రటేరియెట్‌‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటల విస్తీర్ణం అంచనాతో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయొచ్చని, దీనికి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సాంకేతిక పరిజ్ఞానం, సౌకర్యాలను ఉపయోగించి ఆగస్టు, సెప్టెంబర్ నాటికి పంటల వారీగా విస్తీర్ణ అంచనాలను సిద్ధం చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. 

ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు స్విట్జర్లాండ్ సంస్థతో కలిసి సింథటిక్ అపెర్చర్ రాడార్ (ఎస్‌‌ఏఆర్) డేటా ఆధారంగా చేసిన ప్రయోగాలు, వానాకాలంలో వివిధ రాష్ట్రాల్లో పంటల నమోదులో సాధించిన కచ్చితత్వాన్ని మంత్రికి వివరించారు. పంటలపై చీడపీడల నివారణకు సెన్సార్ టెక్నాలజీ ద్వారా ముందస్తు సమాచారం సేకరణ సాధ్యమని, ఈ దిశగా ఈ పంటకాలం నుంచే ప్రయోగాలు చేపట్టాలని శాస్త్రవేత్తలకు మంత్రి సూచించారు.