సర్వారెడ్డిపల్లిలో ఫుడ్  ప్రాసెసింగ్  యూనిట్ : దుద్దిళ్ల శ్రీధర్ బాబు

 ఆమనగ.ల్లు, వెలుగు: నాగర్ కర్నూల్  జిల్లా సర్వారెడ్డిపల్లిలో త్వరలో రూ.800 కోట్లతో ఫుడ్  ప్రాసెసింగ్  యూనిట్  ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. యూనిట్​ ఏర్పాటు కోసం బహుళ జాతి కంపెనీలు ముందుకు వచ్చాయని చెప్పారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లో కేజీబీవీ బిల్డింగ్​ను మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ప్రారంభించారు. అంతకుముందు మంత్రి జూపల్లి మండంలంలోని జమ్ములబావి తండాలో 26 మంది చెంచులకు బోరు మోటార్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రతిపక్షాలు రుణమాఫీపై విష ప్రచారం చేస్తున్నాయని, నేటి నుంచి రూ.31 వేల కోట్ల రుణమాఫీని వర్తింపజేస్తామని తెలిపారు.

అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తొమ్మిదేండ్లుగా నోటిఫికేషన్లు వేయకుండా కాలం వెళ్లదీసిన బీఆర్ఎస్  ప్రభుత్వం, ఇప్పుడు ఆ పార్టీ నేతలు నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. వారి మాటలను నిరుద్యోగులు పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్  పాలనలో విద్య, వైద్యరంగాలను నీరుగార్చారనే విషయాన్ని గుర్తించి.. ఆ రంగాలను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జాబ్  క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న మాజీ మంత్రి హరీశ్ రావు ఇప్పుడు ఏం చేస్తారో? చెప్పాలని డిమాండ్  చేశారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్ఎస్ కే దక్కిందని విమర్శించారు. కార్యక్రమంలో నాగర్ కర్నూల్  ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, ఈర్లపల్లి శంకర్, రాష్ట్ర పొల్యూషన్ బోర్డ్  మెంబర్​ బాలాజీ సింగ్, కలెక్టర్  శశాంక్, అడిషనల్​ కలెక్టర్  ప్రతిమా సింగ్, డీఈవో శశీంద్ర కుమార్ పాల్గొన్నారు.