రెండు కొత్త మున్సిపాలిటీలు.. సాకారమైన ఏండ్ల కల

  • మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో కొత్త మున్సిపాలిటీలుగా కేసముద్రం, స్టేషన్​ఘన్​పూర్​
  • అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి శ్రీధర్​బాబు
  • సంబురాలు చేసుకుంటున్న స్థానిక ప్రజలు

మహబూబాబాద్/ స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: ఏండ్ల నాటి కల సాకారమైంది. స్థానికంగా ప్రజలు డిమాండ్​ చేస్తున్నా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిరాశ చెందారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్​ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది. ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ సమావేశాల్లో మహబూబాబాద్​జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రాన్ని, జనగామ జిల్లాలోని స్టేషన్​ఘన్​పూర్ ను మున్సిపాలిటీలుగా మార్చనున్నట్లు మంత్రి శ్రీధర్​బాబు ప్రకటించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో శుక్రవారం సంబురాలు చేసుకున్నారు.

కేసముద్రం మున్సిపాలిటీ ఆవిర్భావం.. 

కేసముద్రం స్టేషన్​, కేసముద్రం విలేజ్, ధనసరి, అమీనాపురం, సబ్​స్టేషన్​ తండాలను కలిపి సుమారు 18,532 మంది జనాభాతో కేసముద్రం కొత్త మున్సిపాలిటీ ఆవిర్భవించనుంది. పట్టణ పరిధిలో ప్రముఖ వ్యవసాయ మార్కెట్, రైల్వే స్టేషన్​ ఉండటంతో టౌన్​ మరింతగా విస్తరించనుంది. ఏండ్ల నుంచి డిమాండ్​గా ఉన్న కేసముద్రం మున్సిపాలిటీ కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు కానుండటంతో మండలానికి చెందిన సీఎం సలహాదారుడు వేంనరేందర్​ రెడ్డి, మహబూబాబాద్​ ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్, ఎంపీ బలరాం నాయక్​కు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దీంతో జిల్లాలో  మున్సిపాలిటీల సంఖ్య 5కు చేరనున్నది. 

స్టేషన్​ఘన్​పూర్​ మున్సిపాలిటీ ఇలా..

స్టేషన్​ఘన్​పూర్​గ్రామ జనాభా12721, శివునిపల్లి 6242, చాగల్లు 4520, మొత్తం 23,483 మంది జనాభాతో స్టేషన్​ఘన్​పూర్​ను మున్సిపాల్టీగా ప్రకటించారు. దీంతో అభివృద్ధి మరింత వేగవంతం కానున్నది. 2018 లో స్టేషన్​ఘన్​పూర్​ మేజర్​ గ్రామాన్ని మున్సిపాల్టీగా ప్రకటించాలనే ప్రజలు డిమాండ్​చేశారు. అప్పటి ప్రభుత్వం ప్రజల అభీష్టాన్ని పట్టించుకోలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి  స్టేషన్​ఘన్​పూర్​ మున్సిపాల్టీ ఏర్పాటు కోసం ప్రత్యేక కృషి చేయడంతో ప్రజల కల నెరవేరింది. ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు చెబుతూ సంబురాలు జరుపుకొంటున్నారు.  కాగా, మున్సిపాలిటీగా ఏర్పాటు కానున్న కేసముద్రం, స్టేషన్​ఘన్​పూర్​లలో సౌకర్యాలు పెరుగనున్నాయి. అభివృద్ధి వేగవంతం కాన్నది.  

Also Read :- కాళేశ్వరం మూడో టీఎంసీ ఖర్చుల లెక్కేంది?

ఎమ్మెల్యే కడియం కృషితోనే..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృషితో ప్రభుత్వం స్టేషన్​ఘన్​పూర్​ మున్సిపాల్టీగా ప్రకటించింది. దీంతో అభివృద్ధి వేగంగా జరుగుతుంది. యూత్​కు విద్య, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రజలకు మెరుగైన మౌలిక సౌకర్యాలు ఏర్పడతాయి.- రాపోలు చరణ్​రెడ్డి, యూత్​కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు

నర్సంపేట మున్సిపాలిటీలోకి మరో 7 గ్రామాలు 

నర్సంపేట, వెలుగు: వరంగల్‍ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోకి కొత్తగా రాజపల్లె, ముగ్థంపురం, మహేశ్వరం, నాగుర్లపల్లి, మాదన్నపేట, రాములు నాయక్‍ తండా, ముత్తోజిపేట గ్రామాలు చేరనున్నాయి. అధికారులు మొత్తంగా 8 గ్రామాలను మున్సిపాలిటీలో కలిపేలా ప్రతిపాదనలు పంపగా, రాజుపేట మినహా మిగతావాటిని మున్సిపాలిటీలో చేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం నిర్ణయం తీసుకుంది.