ఒక్క చీర ఇచ్చి.. 100 సార్లు చెప్పుకున్నరు.. బీఆర్ఎస్‎పై మంత్రి సీతక్క ఫైర్

రంగారెడ్డి: దసరా పండగ సందర్భంగా మహిళలకు నాణ్యత లేని ఒక్క చీర.. 100 సార్లు చెప్పుకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీదని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. శనివారం (జనవరి 4) రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో  సీతక్క సుమారు రూ.35 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మహిళా సంఘాలకు 80 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు. అనంతరం చేగూర్‎లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తర్వాత మహిళల అభ్యున్నతి కోసం ఆలోచిస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేనన్నారు.

ALSO READ | తెలంగాణపై పోలవరం ప్రాజెక్ట్ ప్రభావమెంత..? స్టడీ చేయాలని CM రేవంత్ ఆదేశం

 మహిళల ఆర్థికాభివృద్ధి కోసం మహిళా సంఘాలకు19 రకాల వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. మహిళలు తలుచుకుంటే ఇంటినే కాదు, సమాజాన్ని, దేశాన్ని సైతం ఏలగలరని ప్రోత్సాహించారు సీతక్క. మహిళలు ఎదుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారన్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే రైతులకు రూ.21 వేల కోట్లు రుణ మాఫీ చేశామని గుర్తు చేశారు. అలాగే.. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమన్నారు.