మహిళా సంఘాలకు మొబైల్ ఫిష్ వెహికల్స్

  • 25 వాహనాలను ప్రారంభించిన మంత్రి సీతక్క


హైదరాబాద్/బషీర్ బాగ్, వెలుగు: మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. మహిళల ఉపాధి కల్పనకు, వ్యాపారాల్లో రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నదని తెలిపారు. 17 రకాల వ్యాపారాలకు లోన్లు, బీమా స్కీమ్స్ అమలు చేస్తున్నామని వివరించారు. ప్రజాభవన్‌‌లో 25 సంచార చేపల విక్రయ వాహనాలను సీతక్క జెండా ఊపి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం వాహనాలను పరిశీలించి.. మహిళా సంఘాలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘మహిళా సంఘాల ఫిష్ ఫుడ్ కు మంచి బ్రాండ్ క్రియేట్ కావాలి. 100% సక్సెస్ రేట్ సాధించాలి. అమ్మ చేతి వంటకు మారుపేరుగా ఇందిరా మహిళా క్యాంటీన్లు ఉండాలి. 

సంచార చేపల విక్రయ వాహనాల్లో వ్యాపారాలు విజయవంతం కావాలి. మండల కేంద్రాల వరకు ఈ వ్యాపారం వెళ్లాలి. నాణ్యత, మంచి రుచితో ఆరోగ్యకరమైన చేప వంటకాలు తయారు చేయాలి’’అని మహిళా సంఘాలను మంత్రి సీతక్క కోరారు. కార్యక్రమంలో సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, అంగన్​వాడీ కేంద్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని జిల్లా సంక్షేమ అధికారులకు (డీడబ్ల్యువో) మంత్రి సీతక్క సూచించారు. చిన్నారులే దేశ భవిష్యత్తు అన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. హైదరాబాద్ మధురానగర్​లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్​లో డీడబ్ల్యూవో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు.  

పల్లెలకు అక్షరాలు పరిచయం చేసింది సావిత్రి బాయి పూలేనే..

చదువు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి సావిత్రి బాయి పూలే అని మంత్రి సీతక్క అన్నారు. ఆమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ప్రజాభవన్, రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమాల్లో సీతక్క పాల్గొన్నారు. ఆమె ఫొటోకు పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. ‘‘సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా వుమెన్స్ టీచర్స్ డేగా జరుపుకోవడం సంతోషకరం. మారుమూల పల్లెలు, దళితవాడలకు అక్షరాలను పరిచయం చేసింది సావిత్రిబాయి పూలేనే..’’అని మంత్రి సీతక్క అన్నారు. రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అందుకోసమే కులగణన చేపట్టామని, దాన్ని కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సావిత్రిబాయి పూలే స్ఫూర్తితోనే 10వ తరగతి చదివి ఉద్యమంలోకి వెళ్లిన తాను.. బయటికొచ్చాక ఎల్ఎల్​బీ, ఎంఏ, ఎల్ఎల్ఎం, పీహెచ్​డీలు చేసినట్లు గుర్తు చేశారు. మహిళల విద్యాప్రదాత సావిత్రిబాయి పూలే అని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. బీసీలకు అన్యాయం జరిగితే తాను ముందుండి పోరాడుతానని తెలిపారు. ప్రజాభవన్​లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాకవి జయరాజు, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్ పాల్గొన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించి ప్రోగ్రామ్​లో ఎంపీ లక్ష్మణ్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు మణి మంజరి తదితరులు పాల్గొన్నారు. 

అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తు రాలేదా?

పదేండ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కవితకు బీసీలు గుర్తు రాలేదా? అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో వ్యవహరించి.. ఇప్పుడు మమకారం కురిపిస్తే బీసీలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. బీసీల ఉద్యమాన్ని హైజాక్ చేసేందుకు కవిత ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. బీసీ మహాసభలో కాంగ్రెస్​పై కవిత చేసిన కామెంట్లపై సీతక్క ఫైర్ అయ్యారు. సెక్రటేరియెట్​లో ఆమె మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ తోడేళ్ల గుంపు లాంటిదని, భక్షించడమే తప్ప.. రక్షించడం తెల్వదని అన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నదన్నారు.