ప్లాస్టిక్ స్థానంలో వెదురును వాడాలి

  • ఏజెన్సీ ప్రాంతాల్లో సాగును ప్రోత్సహిస్తం: సీతక్క 
  • అటవీ భూముల్లో వెదురు సాగు కొనసాగించండి
  • వెదురుపై సెర్ప్ ఆధ్వర్యంలో జరిగిన వర్క్​షాప్​లో మంత్రి సూచనలు

హైదరాబాద్, వెలుగు: అటవీ సమీప గ్రామాలు, మారుమూల ప్రాంతాలు వెదురు సాగుకు అనుకూలంగా ఉంటాయని, వెదురు సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. బుధవారం జూబ్లీహిల్స్​లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సెర్ప్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి వెదురు వర్క్ షాప్ నిర్వహించారు. సెర్ప్​తో కలిసి పని చేసేందుకు బెంగళూరుకు చెందిన వెదురు వస్తువుల మార్కెటింగ్ సంస్థ ఇండస్ట్రీ ముందుకొచ్చింది.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. వెదురుతో వస్తులను తయారు చేసేందుకు ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్లాస్టిక్​తో పర్యావరణం దెబ్బతింటుందని, దాని స్థానంలో వెదురును ఉపయోగించి పర్యావరణహితులుగా మారాలని మంత్రి పిలుపునిచ్చారు. అటవీ భూముల్లో వెదురు మొక్కల సాగును కొనసాగించాలని కోరారు. మూడునాలుగు ఏండ్లు ఓపిక పడితే పంట చేతికొస్తుందని, ఎకరంలోపు భూమిలోనే ఏడాదికి రూ.లక్షదాకా సంపాదించవచ్చని పేర్కొన్నారు. 

వెదురు.. గ్రీన్ గోల్డ్ లాంటిదని, తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయాన్నిస్తోందని చెప్పారు. వెదురు సాగుపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఐటీడీఏ పీఓలు ఏజెన్సీ ప్రాంతాల్లో వెదురు సాగును ప్రోత్సహించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళా శక్తి స్కీం కింద మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నారని, మొత్తం 17 రకాల వ్యాపారాలను గుర్తించామని, మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నామని సీతక్క చెప్పారు.

వెదురు సాగు కోసం ప్రోత్సాహాకాలు కలిస్తున్నామని, విత్తనాల నుంచి సాగు వరకు అన్నీ ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. ఉపాధి హామీ నిధుల ను కూడా వెదురు పంటకు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. సెర్ప్ సీఈవో దివ్య దేవారాజన్ మాట్లాడుతూ వెదురు.. గడ్డి జాతి మొక్క, ఎంత కట్ చేస్తే అంత ఎత్తుకు పెరుగుతుందన్నారు. దాన్ని నాశనం చేయడం చాలా కష్టమని, వెదురు సాగుతో ఎన్నో లాభాలు పొందవచ్చని చెప్పారు. 

2,600 కోట్లతో గ్రామీణ రహదారులు నిర్మిస్తున్నాం

రూ. 2,600 కోట్లతో గ్రామీణ రహదారులు నిర్మిస్తున్నామని, రోడ్ల నిర్వహణ కోసం రూ.1,600 కోట్లు వెచ్చిస్తున్నామని, 30 మెట్రిక్ టన్నుల వాహనాలు నడిచేలా రోడ్ల సామర్థ్యాన్ని మెరుగుపరచాలని, అందుకు అనుగుణంగా రూరల్ ఇంజినీర్లు కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. బుధవారం ఎర్రమంజిల్​లోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ కార్యాలయంలో రూరల్ ఇంజినీర్లతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. 

సీఎం ఆదేశాల మేరకు ప్రతీ ఆవాసం నుంచి గ్రామపంచాయతీ అక్కడ నుంచి మండలానికి, జిల్లా కేంద్రానికి రహదారులు నిర్మిస్తున్నామని సీతక్క చెప్పారు. రూరల్ ఇంజినీర్లు కట్టే నిర్మాణాలు పది తరాలకు పనికివచ్చేలా ఉండాలన్నారు. పనులు సరిగా చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని, నాసిరకం పనులకు ఎన్ఓసీలిచ్చే అధికారులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రోడ్డు సదుపాయం లేని ఆవాసాలు, గ్రామాలు ఉండొద్దన్నారు. ఆ లక్ష్యంతో పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం పని చేయాలన్నారు.