రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్‌‌దే : మంత్రి సీతక్క

  • గత ప్రభుత్వ రుణమాఫీ వడ్డీకే సరిపోయింది: మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్‌‌దేనని, రైతులు వరి వేస్తే ఉరి అన్నది మీరు కాదా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. కౌలు రైతులకు రైతు బంధు ఎందుకివ్వాలని అన్నది మీరు కాదా? అద్దె ఇంట్లో ఉన్నవాళ్లు ఓనర్లు అవుతారా అన్నది మీరు కదా? అని నిలదీశారు. కౌలు రైతుల గురించి మాట్లాడే అర్హత బీఆర్‌‌‌‌ఎస్‌‌కు లేదన్నారు. రాష్ట్రంలో భూములపై సమగ్ర సర్వే జరగాలన్నారు. రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల జీతాలు తీసుకునే వారు కూడా రైతుల ముసుగులో రైతు బంధు తీసుకున్నారని చెప్పారు.

గుట్టలు, రోడ్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందని, నిజంగా వ్యవసాయం చేసే కౌలు రైతులకు రైతుబంధు రాలేదని పేర్కొన్నారు. ‘‘బీఆర్ఎస్ ఇచ్చింది రైతుబంధు కాదు.. పట్టా పెట్టుబడి. పట్టాలేని ఎంతో మంది రైతులకు రైతుబంధు రాలేదు. బీఆర్ఎస్ చేసింది రుణమాఫీ కాదు.. వడ్డీ మాఫీ. బీఆర్ఎస్ అందరికీ రుణమాఫీ చేస్తే.. ఇప్పుడు రూ.30 వేల కోట్ల రుణ భారం ఎందుకు ఉంది. భూమి లేని పేదలకు మీరు ఏమిచ్చారు” అని మంత్రి నిలదీశారు. 

వందల ఎకరాల ఫౌం హౌస్‌‌లకు కూడా రైతు భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ అడుగుతుందా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా ఎవరికి ఎంత వెళ్తుందో అన్ని గ్రామాల్లో ఆయా వివరాలు అందుబాటులో ఉంచాలని ఆమె సూచించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంట పొలాలకు మెటల్ రోడ్లు వేశామని, ఇప్పుడు కూడా కొన్ని ప్రతిపాదనలు వచ్చాయని, వాటిని మంజూరు చేస్తామని చెప్పారు.