పల్లెల అభివృద్ధే ప్రధాన ఎజెండా .. ఫారెస్ట్ రేంజ్ క్వార్టర్స్ ప్రారంభంలో మంత్రి సీతక్క

మంగపేట, వెలుగు : కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతున్నారని, ప్రజలకు అవసరమైన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం ములుగు జిల్లా మంగపేట మండలంలో సుమారు రూ.36 లక్షల పాండా నిధులతో నిర్మించిన ఫారెస్ట్ రేంజ్ క్వార్టర్స్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు. పల్లెల అభివృద్ధి ప్రధాన అజెండాగా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు మెరుగు పర్చడానికి కొత్త రోడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలో నూతనంగా రోడ్డు నిర్మించడంతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు 

చెప్పారు. 

పర్యాటకంగా తీర్చిదిద్దుతాం.. 

పచ్చని అడవులతో పారే సెలయేల్లతో ప్రాచీన దేవాలయాలతో ఆధ్యాత్మికత సహజ సుందరంగా ఉన్న ములుగు జిల్లాను పర్యాటకంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో అగ్రగామిగా చేస్తానని మంత్రి సీతక్క తెలిపారు. లక్నవరం, రామప్ప, పస్రా నుంచి పచ్చని అడవులు, తాడ్వాయి సమ్మక్క సారక్క, వాజేడు బొగతా జలపాతం, మంగపేటలో మల్లూరు హేమాచలం పర్యాటక శోభను సంతరించుకున్నాయని, ఈ ప్రదేశాలను అభివృద్ధి చేస్తే ములుగు జిల్లా పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందన్నారు. 

అనంతరం మంగపేట నుంచి బ్రాహ్మణపల్లి, దోమేడ, నిమ్మగూడెం గ్రామాల్లో మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, ఎంపీడీవో బద్రు, తహసీల్దార్ తోట రవీందర్, కాళేశ్వరం సర్కిల్ సీసీఎఫ్ డా.బి ప్రభాకర్, ములుగు, తాడ్వాయిలు డీఎఫ్ వో రాహుల్ కిషన్ జాదవ్, వజ్రారెడ్డి, మంగపేట ఇన్చార్జి ఎఫ్ ఆర్ వో అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.