జైలుకెళ్లి యోగా చేస్తనంటివిగదా కేటీఆర్.. ఇప్పుడు భయమెందుకు: మంత్రి సీతక్క

  • తప్పు చేయకపోతే విచారణ ఎదుర్కోవాలి

హైదరాబాద్, వెలుగు: మొన్నటిదాకా జైలుకెళ్తా.. యోగా చేస్తా.. స్లిమ్ అయి వస్తా అని కామెంట్లు చేసిన కేటీఆర్.. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని మంత్రి సీతక్క నిలదీశారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేబినెట్ ఆమోదం తీసుకోకుండా విదేశీ సంస్థకు కేటీఆర్ డబ్బులు చెల్లించారని ఆరోపించారు.

ప్రభుత్వ అనుమతి లేని అంశానికి సభలో చర్చ పెట్టాలనడం వింతగా ఉందన్నారు. అసెంబ్లీ ఆవరణలో సీతక్క మీడియాతో చిట్​చాట్ చేశారు. ‘‘గతంలో ప్రభుత్వ కేసులు ఎదుర్కొన్న నాయకులు కోర్టుకు వెళ్తే కేటీఆర్ తప్పుబట్టిండు. ఇప్పుడు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కినట్లు? కేటీఆర్​కు నిజాయితీ లేదు. లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే భూ భారతి బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నడు. భూ కబ్జాల బాగోతం ఎక్కడ బయటపడుతుందో అని బీఆర్ఎస్ లీడర్లకు భయం పట్టుకున్నది.

చట్టం ముందు అందరూ సమానమే. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో విచారణ ఎదుర్కోవాల్సిందే. గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చిన కేసుపై సభలో చర్చ అవసరం లేదు. బీఏసీలో ఈ ఫార్ములా కేసుపై చర్చ కోసం బీఆర్ఎస్ ఎందుకు అడగలేదు? పార్లమెంట్​లో అంబేద్కర్​ను.. అసెంబ్లీలో దళిత స్పీకర్​ను అవమానించారు’’అని సీతక్క ఫైర్ అయ్యారు.