జనవరి 1 నుంచి జాతీయ రోడ్డు భద్రతా మాసం

 

  • బ్యానర్లు, ఫ్లెక్సీలతో అవగాహన కల్పించండి
  • రవాణా శాఖ అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జనవరి 1 నుంచి 31వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసం నిర్వహించాలని అధికారులను రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  ఆదేశించారు. దీనిపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని 97 ఆర్టీసీ డిపోలు, 62 రవాణా కార్యాలయాల్లో భద్రతా నియమాలతో కూడిన బ్యానర్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.  జాతీయ రోడ్డు భద్రతా మాసంలో ప్రజాప్రతినిధుల్ని భాగస్వామ్యం చేయాలని దిశానిర్దేశం చేశారు.  మంగళవారం అధికారులతో  ఆయన జూమ్‌‌ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ట్రాఫిక్ పై  ప్రతి స్కూళ్లో అవగాహన కల్పించాలని తెలిపారు. రోడ్డు భద్రతాపై ర్యాలీలు , ట్రైనింగ్ క్లాస్ లు, వర్క్ షాప్ లు, సెమినార్ లు నిర్వహించాలన్నారు. డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అలాగే..ఆర్టీసీలో కొత్త బస్సుల యాక్షన్ ప్లాన్ గురుంచి అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ర్టీసీలో కారుణ్య నియామకాలు పెండింగ్ లేకుండా చూసుకోవాలని సూచించారు. మధిర ,కోదాడ , హుజూర్ నగర్ , మంథని, ములుగు బస్ స్టేషన్ ల అభివృద్ధిపై మంత్రి పలు సూచనలు చేశారు.రవాణా శాఖలోని యూనిఫాం ఉద్యోగులు కొత్త లోగోను విధిగా ధరించాలని మంత్రి కోరారు. సమావేశంలో రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, జేటీసీలు, డీటీసీలు, ఆర్టీవోలు, ఆర్టీసీ ఈడీలు తదితరులు పాల్గొన్నారు.