శనిగరం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్​

కోహెడ, వెలుగు: మండలంలోని శనిగరం ప్రాజెక్టును సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్​ సందర్శించారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ, పూలు వేసి పూజలు చేశారు. అనంతరం బీసీ హాస్టల్ ను తనిఖీ చేశారు. హాస్టల్​పక్కన ఉన్న గుట్ట నుంచి వరద నీరు హాస్టల్ లోకి వస్తుందని సిబ్బంది మంత్రి దృష్టికి తీసుకురావడంతో గుట్ట నుంచి వచ్చే నీటిని  డ్రెయిన్ సిస్టమ్ ద్వారా పంపించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

హాస్టల్​లో అందుతున్న సౌకర్యాల గురించి స్టూడెంట్స్​ను అడిగి తెలుసుకున్నారు. బోర్, టాయిలెట్స్ ఇబ్బంది ఉందని చెప్పగా వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. తంగళ్లపల్లి గ్రామంలో విద్యుత్ స్తంభాల షిప్టింగ్​ కోసం రూ.5 లక్షలు శాంక్షన్ చేసినప్పటికీ పనుల ఆలస్యంపై మండిపడ్డారు. అనంతరం మండల కేంద్రంలో తహసీల్దార్​ఆఫీస్​లో ప్రజా సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. పార్టీ మండల అధ్యక్షుడు ధర్మయ్య, శంకర్, జగన్​రెడ్డి, సుధాకర్, రవీందర్, మల్లారెడ్డి, శ్రీకాంత్, తహసీల్దార్​సురేఖ, ఎంపీడీవో కృష్ణయ్య, ఎంపీవో శోభ ఉన్నారు.

రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ. 60 కోట్లు

హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి పంచాయతీరాజ్​ఎంఆర్​ఆర్​, సీఆర్​ఆర్​ గ్రాంట్ల కింద రూ.60  కోట్లు మంజూరైనట్టు మంత్రి పొన్నం ప్రభాకర్​తెలిపారు. సోమవారం ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. సీఆర్ఆర్​గ్రాంట్​కింద రూ.50 కోట్లు, ఎంఆర్​ఆర్​గ్రాంట్​ కింద రూ.10 కోట్లు మంజూరైనట్టు చెప్పారు.