రోడ్​సేఫ్టీపై ప్రతి ఊర్లో అవగాహన కల్పించండి : మంత్రి పొన్నం ప్రభాకర్

  • స్టూడెంట్లతో ర్యాలీలు, ముగ్గుల,క్విజ్ పోటీలు: పొన్నం
  • జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలపై కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ 

హైదరాబాద్, వెలుగు: జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రతి ఊర్లో రోడ్​స్టేఫ్టీపై అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఈ నెల 2 నుంచి ప్రారంభమైన రహదారి భద్రతా మాసోత్సవాలు 31వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో చేపట్టనున్న పలు కార్యక్రమాలపై మంత్రి పొన్నం శనివారం సెక్రటేరియెట్ నుంచి కలెక్టర్ లతో వీడియో కన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్కూల్ ​స్టూడెంట్లకు ముగ్గులు, డ్రాయింగ్, వ్యాసరచన, రహదారి భద్రతపై క్విజ్ పోటీలు పెట్టాలని సూచించారు. విద్యార్థులతో జిల్లా, మండల కేంద్రాల్లో ర్యాలీ, హెల్మెట్ ధరించిన వారితో బైక్ ర్యాలీలు తీయాలని, ప్రైవేట్, ప్రభుత్వ బడుల్లో ట్రాఫిక్ అవగాహన పార్క్ ఏర్పాటు చేసేలా చూడాలని.. ఇందుకు కలెక్టర్, విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ట్రాఫిక్ కూడళ్ల వద్ద అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలని, డ్రైవర్లకు హెల్త్ క్యాంప్ లు ఏర్పాటు చేయాలని, టోల్ గేట్ల వద్ద రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించాలని సూచించారు.

యాక్సిడెంట్లు తగ్గించేందుకు కృషి చేయాలి

తెలంగాణలో ప్రతి రోజు రోడ్డు ప్రమాదాల్లో 20 మంది మరణిస్తున్నారని, దీనిని పూర్తిగా తగ్గించడానికి అందరూ కలిసి పనిచేయాలని మంత్రి పొన్నం అన్నారు. అతి వేగం, మద్యం సేవించి నడపడం, ఫోన్ మాట్లాడుతూ, విశ్రాంతి లేకుండా డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో 80 శాతం యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఈ నెల 7న రోడ్డు భద్రత పై జాతీయ మాసోత్సవాల్లో భాగంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీతో సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు.

జిల్లాల్లో అవగాహన సదస్సులు, సెమినార్లు, వర్క్ షాప్ లు నిర్వహించాలని, స్కూళ్లు, కాలేజీలు, గురుకులాలు, వృత్తి శిక్షణ సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రముఖ వ్యక్తులను రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగస్వామ్యం చేయాలని కోరారు. వీసీలో రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ గురుకులాల కొత్త బిల్డింగ్ ల నిర్మాణలకు ప్రపోజల్స్ ఇవ్వండి

బీసీ గురుకులాల కొత్త బిల్డింగ్​ల నిర్మాణలకు ప్రపోజల్స్​ఇవ్వాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్​ ఆదేశించారు. బీసీ సంక్షేమశాఖలో అమలు చేస్తున్న పథకాలను చేయూత ద్వారా వాటికి కేటాయించే బడ్జెట్ ప్రతిపాదనలపై పలు సూచనలు చేశారు.  శనివారం సెక్రటేరియట్ లో బీసీ సంక్షేమ శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రభుత్వం 40 శాతం డైట్ చార్జీలు పెంచిందని దానిని మెనూ ప్రకారం అమలు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. జూన్ లో పాఠశాలలు పున:ప్రారంభమయ్యేలోపు  వారికి యూనిఫామ్స్, పుస్తకాలు ఇతర వస్తువులు అందించాలని తెలిపారు.

సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసినట్టు మోడ్రన్ దోబీ ఘాట్లను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కుల వృత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వారికి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల17న మరోసారి సమావేశాన్ని ఏర్పాటు చేసి వివిధ ప్రతిపాదనలపై మరోసారి చర్చించనున్నట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ  సెక్రటరీ శ్రీధర్, కమిషనర్ బాల మాయాదేవి, బీసీ గురుకుల సెక్రటరీ సైదులు ఇతర బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.