ఎల్లమ్మచెరువును అభివృద్ధి చేస్తా : పొన్నం ప్రభాకర్​

  • మంత్రి పొన్నం ప్రభాకర్​

కోహెడ(హుస్నాబాద్), వెలుగు: హుస్నాబాద్​కు తలమానికమైన ఎల్లమ్మ చెరువును మరింత అభివృద్ధి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. ఆదివారం రూ.18 కోట్లతో చేపట్టే ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్​తరానికి ఉపయోగపడేలా ఎల్లమ్మ చెరువును తీర్చిదిద్దుతానన్నారు. పార్కింగ్​సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఆరెపల్లి వద్ద రూ.17కోట్లతో బతుకమ్మ ఘాట్, పల్లె చెరువు, కొత్త చెరువును అభివృద్ధి చేస్తామన్నారు. 

ఎల్లమ్మ చెరువు నుంచి పందిల్ల వరకు రూ. 3కోట్లతో రోడ్డు నిర్మాణం చేస్తామన్నారు. రైతు భరోసాను రూ.10 వేల నుంచి రూ.12వేలకు పెంచామన్నారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో పడుతాయన్నారు. రేషన్​కార్డుల పంపీణీ సైతం ప్రారంభమవుతుందన్నారు. భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేల చొప్పున ఇందిరమ్మ ఆత్మీయ కానుకగా అందిస్తామన్నారు. అనంతరం పట్టణంలోని పలు వార్డుల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.  

గురుకుల స్కూల్ విజిట్

మైనార్టీ బాలికల గురుకుల స్కూల్​ను మంత్రి పొన్నం ప్రభాకర్​ విజిట్​చేశారు. ప్రభుత్వం డైట్​చార్జీలు పెంచిన తర్వాత అమలవుతున్న మెనూపై ఆరా తీశారు. స్టూడెంట్స్​తో కలిసి భోజనం చేశారు. మెనూలో ఎక్కడా ఇబ్బంది రావొద్దని సిబ్బందికి సూచించారు. స్టూడెంట్స్​ చదువుతో పాటు క్రీడలు, సైన్స్​ ఇన్నోవేషన్​లోనూ రాణించాలన్నారు. అన్ని గురుకులల్లో ఎన్ సీసీ, ఎన్​ఎస్​ఎస్​,రెడ్​క్రాస్​ప్రవేశపెడతామని తెలిపారు. 

అనంతరం పట్టణంలోని బురుజు వద్ద రూ.3కోట్లతో నిర్మించిన రైతు బజార్​, కోటి రూపాయలతో వ్యవసాయ మార్కెట్​లో నిర్మించిన కవర్​షెడ్​గోదాంను ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​అబ్దుల్​హమీద్, లైబ్రరీ చైర్మన్​లింగమూర్తి, సింగిల్​విండో చైర్మన్ శివ్వయ్య, మున్సిపల్ చైర్​పర్సన్​రజిత, ఆర్డీవో రామ్మూర్తి, ఏఎంసీ చైర్మన్​తిరుపతిరెడ్డి ఉన్నారు.