పదేండ్లలో అప్పుల ఊబిలోకి నెట్టారు : మంత్రి పొన్నం ప్రభాకర్ 

సిద్దిపేట రూరల్, వెలుగు: పదేండ్లలో బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర సంపదను దోచుకుని.. అప్పుల ఊబిలోకి నెట్టివేశారని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ పాలనలోని అవకతవకలను సరిదిద్దుతున్నామని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన  సిద్దిపేట కాంగ్రెస్​ఇన్​చార్జి పూజల హరికృష్ణతో కలిసి నారాయణరావుపేట మండలం జక్కాపూర్ లో సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు.

గ్రామానికి చెందిన మోసర్ల భూపతి రెడ్డి కుటుంబ వివరాలను మంత్రి స్వయంగా అడిగి తెలుసుకుని నమోదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వేను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు లక్షల రుణమాఫీకి కసరత్తు జరుగుతుందని.. రైతు భరోసా కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. దుబ్బాక కాంగ్రెస్​ఇన్​చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి, డీసీసీ ప్రధాన కార్యదర్శి రాజ్ వీర్, రాగుల అశోక్, పల్లె శ్రీనివాస్ ఉన్నారు. 

సిద్దిపేట టౌన్: నిరుద్యోగ యువతకు చక్కటి వేదిక లైబ్రరీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని లైబ్రరీలో 57వ జిల్లా లైబ్రరీ వారోత్సవాల కార్యక్రమానికి రాష్ట్ర  లైబ్రరీ చైర్మన్ రియాజ్, కాంగ్రెస్​నియోజకవర్గ ఇన్​చార్జి పూజల హరికృష్ణతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత సోషల్ మీడియా, టీవీలు చూస్తూ సమయాన్ని వృథా చేయొద్దన్నారు.  

లైబ్రరీలో చదువుకునే వారికి అన్ని సౌకర్యాలు సమకూర్చాలన్నారు.  అనంతరం గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శన హాల్ ను ప్రారంభించి జిల్లాలో అవసరమైన చోట లైబ్రరీలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, అడిషనల్​కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీవో సదానందం, పూజల హరికృష్ణ, చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. 

సర్వేను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలు

కొండపాక: సమగ్ర కుటుంబ సర్వేపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. మండలంలోని దుద్దెడలో పీఏసీఏస్ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంత్రి అధికారులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న సర్వే తీరును పరిశీలించారు. సర్వేలో బ్యాంకు, ఇతర వివరాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వీలైనంత త్వరగా రైతులకు చెల్లింపులు చేసేలా అధికారులకు  సూచించారు. మార్కెట్ యార్డు స్థలం కోసం రైతులు మంత్రిని అడగా వెంటనే తహసీల్దార్ దిలీప్ నాయక్ ను స్థలం చూసి ప్రపోజల్ కు పంపించాలని కోరారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగారావు, మాజీ సర్పంచ్ మహదేవ్ గౌడ్ , సురేందర్ రావు, అంజయ్య, మల్లికార్జున్, పర్శరాములు, శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.