స్టేట్​ లెవల్​లో ఆడితే రూ.50 వేలు..నేషనల్​ లెవల్​లో ఆడితే రూ.లక్ష : మంత్రి పొన్నం ప్రభాకర్​

కోహెడ(హుస్నాబాద్​), వెలుగు : క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్టేట్ లెవల్​లో ఆడిన వారికి రూ.50 వేలు, నేషనల్ లెవల్​లో ఆడిన వారికి రూ.లక్ష బహుమానం అందిస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్​అన్నారు. మంగళవారం హుస్నాబాద్​ మినీ స్టేడియంలో సీఎం కప్​ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు యంగ్​ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొస్తుందని అందులో హుస్నాబాద్​ నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు చేరాలన్నారు.

ఇందుకోసం పీఈటీలు కృషి చేయాలని సూచించారు. భవిష్యత్​లో మన వాళ్లు ఒలంపిక్స్​లో రాణించాలంటే ముందు స్టేట్, నేషనల్, ఏషియన్​​ గేమ్స్​లో ఆడి గెలవాలన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్​ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే సతీశ్​బాబు, ఎంపీ బండి సంజయ్​నియోజకవర్గ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.

కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్​రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, లైబ్రరీ చైర్మన్​లింగమూర్తి, మున్సిపల్​చైర్ పర్సన్​ రజిత, సింగిల్​విండో చైర్మన్​శివ్వయ్య, ఆర్డీవో రామ్మూర్తి, బొమ్మ శ్రీరామ్ ఉన్నారు.​