రైతు భరోసాపై బీజేపీ, బీఆర్ఎస్​ రాద్ధాంతం : మంత్రి పొన్నం ప్రభాకర్​

కోహెడ(హుస్నాబాద్​)వెలుగు: రైతు భరోసాపై బీజేపీ,బీఆర్ఎస్​ కలిసి ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాయని  మంత్రి పొన్నం ప్రభాకర్​ మండిపడ్డారు. సోమవారం హుస్నాబాద్​లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా  ప్రాధాన్యత క్రమంలో పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని ప్రశంసించాల్సింది పోయి విమర్శించడం సిగ్గు చేటన్నారు. వ్యవసాయ యోగ్యమైన  భూములకు రైతు భరోసా ఇస్తామంటే దానిపై అనవసర రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గుట్టలు, రోడ్లు, రాళ్లు, చెరువులు, వెంచర్లకు ఇవ్వమంటరా అని బీఆర్ఎస్​ను ప్రశ్నించారు. బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలను తెస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు.

 బీజేపీ నిర్వాకం వల్లే రైతు సంఘం నాయకుడు దల్జీర్​ సింగ్​20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారన్నారు. బీజేపీకి రైతుల మీద ప్రేమ ఉంటే తాము ఇస్తున్న రైతు భరోసాకి తోడు మరో రూ.12 వేలు అందించాలని డిమాండ్​ చేశారు. అనంతరం అక్కన్నపేట మండలం రామవరం నుంచి హుస్నాబాద్​ వరకు రూ.25 కోట్లతో నిర్మించే డబుల్​రోడ్డు, కొత్తకొండ నుంచి అంతక్కపేట వరకు రూ.25కోట్లతో నిర్మించే డబుల్​ రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.10 నెలల్లో రోడ్డు నిర్మాణాన్ని కంప్లీట్​ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడి నుంచి కొమురవెల్లికి వెళ్లెందుకు రోడ్డు వేస్తామన్నారు. 

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ

హుస్నాబాద్​లో 40 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలను మంత్రి పొన్నం ప్రభాకర్​ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు పని చేయాలని సూచించారు. ఇతర మండలాల్లో ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఆర్డీవో, ఇతర అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.  కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, సింగిల్​విండో చైర్మన్ శివ్వయ్య, మున్సిపల్​చైర్ పర్సన్​రజిత, ఆర్డీవో రామ్మూర్తి, ఏఎం​సీ చైర్మన్​తిరుపతిరెడ్డి ఉన్నారు.