గీత కార్మికుల రక్షణ కోసమే కాటమయ్య కిట్లు : మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట(హుస్నాబాద్), వెలుగు: గీత కార్మికుల రక్షణ కోసమే కాటమయ్య కిట్లను అందజేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హుస్నాబాద్ తిరుమల గార్డెన్ లో గీత కార్మికులకు కాటమయ్య కిట్లను పంపిణీ చేసి మాట్లాడారు. తాటి చెట్టు ఎక్కే ప్రతి గీత కార్మికుడికి కాటమయ్య కిట్లు అందజేస్తామన్నారు. తాటి చెట్లు తక్కువ ఎత్తు ఉండేలా శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయని, తాటి, ఈత చెట్లను కాల్వలు, రోడ్లు, చెరువు గట్ల పక్కన నాటాలని సూచించారు.  

గీత కార్మికుల ఎక్స్ గ్రేషియా బకాయిలు విడుదలయ్యేలా చూస్తానన్నారు. కాటమయ్య కిట్లు మన కుటుంబాలకు రక్షణ అన్న విషయం మరవొద్దన్నారు. మార్చి తర్వాత గీత కార్మికులకు మోపెడ్ లు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్ రజిత,  గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.