నిమజ్జనం ప్రశాంతంగా జరపాలి : పొన్నం ప్రభాకర్​

హుస్నాబాద్, వెలుగు: వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరపాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని ఎల్లమ్మచెరువు వద్ద నిమజ్జనం చేసే ప్రదేశాలను పరిశీలించారు. వినాయక ఉత్సవాల్లో తొమ్మిది రోజులు ఒక ఎత్తయితే, నిమజ్జనం మరో ఎత్తని, ఆ టైంలో ఆదమరిచి ఉంటే ప్రాణాలకే ప్రమాదమన్నారు. నిమజ్జన సమయంలో మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించేలా మున్సిపల్​, రెవెన్యూ, పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 

పోలీసులు అనుమతించిన ప్రాంతాల్లోనే నిమజ్జనం చేసేలా చూడాలన్నారు. రాత్రి 10 గంటలలోపు నిమజ్జనాలు పూర్తి చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును సిద్ధంగా ఉంచాలన్నారు. చెరువుల వద్ద లైటింగ్ సిస్టమ్, బారికేడ్లు పెట్టడంతోపాటు గజ ఈతగాళ్లను రెడీగా ఉంచాలన్నారు. నిమజ్జనం అయిన వెంటనే విగ్రహాలను బయటకు తీసేందుకు సిబ్బందిని నియమించాలన్నారు. అనంతరం మంత్రి ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. ఆయన వెంట మున్సిపల్​ చైర్​పర్సన్​ రజిత, వైస్​ చైర్​పర్సన్​ అనిత, ఆర్డీవో రామ్మూర్తి, తహసీల్దార్​ రవీందర్​రెడ్డి, మున్సిపల్​ కమిషనర్​ మల్లికార్జున్​, ఏసీపీ సతీశ్​, సీఐ శ్రీనివాస్ ఉన్నారు.