సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఇక కార్పొరేట్ స్థాయిలో.. శాశ్వత బిల్డింగులు నిర్మిస్తం: పొంగులేటి

  • మొదటి దశలో నాలుగు జిల్లాల్లో నిర్మాణం
  • గచ్చిబౌలిలో మోడల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం
  • రెవెన్యూ అధికారులతో మంత్రి  సమీక్షా సమావేశం 

హైదరాబాద్, వెలుగు: ప్రజలకు మరింత మెరుగ్గా ప్రభుత్వ సేవలను అందించడానికి సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులను పునర్‌‌వ్యవస్థీకరిస్తామని (రీఆర్గనైజేషన్) రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.  సీఎస్ఆర్ నిధులతో కార్పోరేట్ స్థాయిలో వాటిని  నిర్మించనున్నట్లు చెప్పారు. మంగళవారం ఆయన సెక్రటేరియెట్ లో ఖమ్మం పార్లమెంటు సభ్యుడు రామసహాయం రఘురామరెడ్డితో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇంటి గ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలతో పనితీరు మెరుగుపడుతుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చేవాళ్లు గంటల తరబడి వేచి చూసే పరిస్థితి లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. శాశ్వతంగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణం కోసం అవసరమైన భూములను గుర్తించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా.. వాటిలో 37 మాత్రమే సొంత భవనంలో ఉన్నాయని, మిగిలినవన్నీ అద్దె భవనాలలోనే కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. 

జనవరిలోనే శంకుస్థాపన జరిగేలా చర్యలు 

శాశ్వత భవనాల నిర్మాణం మొదటి దశలో భాగంగా..నాలుగు జిల్లాల్లో  సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తామని మంత్రి తెలిపారు. సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్ని కడతామన్నారు. గచ్చిబౌలిలో మోడల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నిర్మాణం ఉంటుందని వివరించారు. వీటికి జనవరిలోనే  శంకుస్థాపన జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కొత్త సబ్‌‌ రిజిస్ట్రార్‌‌ కార్యాలయాలన్నింటిని ఆధునిక సౌకర్యాలతో దశల వారీగా నిర్మిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, గోల్కొండ మూడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను షేక్ పేట్ ప్రాంతంలో ఒకేచోట నిర్మించాలని నిర్ణయించామని వివరించారు. మొదటి దశలో నిర్మించే సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు కనీసం మూడు ఎకరాల్లో ఉంటాయని..పది నుంచి పదిహేను వేల స్క్వేర్ ఫీట్లలో భవన నిర్మాణం ఉంటుందని చెప్పారు. వెయిటింగ్ హాలు, తాగునీటి సదుపాయము, విశాలమైన పార్కింగ్ వంటి వసతులు ప్రధానంగా ఉండేలా డిజైన్ రూపొందించాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు.  ఈ సమావేశంలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజి  జ్యోతి బుద్ధప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.