కబ్జా భూములు వెనక్కి..ఆక్రమించుకున్నోళ్లను వదిలేది లేదు :  మంత్రి పొంగులేటి

  • ధరణిని బంగాళాఖాతంలో పడేసి.. భూ భారతిని తెస్తున్నం
  • హరీశ్​రావు సలహాలు కూడా తీసుకున్నం
  • వేల పుస్తకాలు చదివిన పెద్దమనిషి ఘనకార్యమే ‘ధరణి’
  • ఉన్న సమస్యలకు తోడు కొత్త సమస్యలనూ తెచ్చిపెట్టింది
  • మానవ సంబంధాలనూ ‘ధరణి’  దెబ్బతీసిందని వ్యాఖ్య
  • గ్రామానికో రెవెన్యూ అధికారిని నియమిస్తామని ప్రకటన
  • కొందరిని డైరెక్ట్​గా రిక్రూట్ చేసుకుంటామని వెల్లడి

హైదరాబాద్​, వెలుగు :  ప్రభుత్వ భూముల్ని ఆక్రమించినవాళ్లు ఎంతటివారైనా వదిలేది లేదని.. ఆ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ధరణి కారణంగా అన్యాక్రాంతమైన భూముల వివరాలను ‘భూ భారతి’ ద్వారా బట్టబయలు చేస్తామన్నారు. 2014కు ముందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర ఉన్న ప్రభుత్వ భూముల జాబితాలోని రెవెన్యూ, ఎండోమెంట్, వక్ఫ్, భూదాన్, ఫారెస్ట్ తదితర భూముల వివరాలను ధరణిలోని డేటాతో పోల్చి చూసి అన్యాక్రాంతమైన భూముల వివరాలను బహిర్గతం చేస్తామని ఆయన చెప్పారు. సామాన్యుల భూహ‌‌క్కుల ప‌‌రిర‌‌క్షణే ధ్యేయంగా -భూభార‌‌తి చ‌‌ట్టాన్ని రూపొందించామ‌‌న్నారు. బుధవారం అసెంబ్లీలో భూభార‌‌తి బిల్లును ప్రవేశ‌‌పెట్టిన  సంద‌‌ర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి మాట్లాడారు.

ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో కలిపి.. భూసమస్యల పరిష్కారానికి భూ-భారతిని తీసుకొస్తున్నామని తెలిపారు. ‘‘గత ప్రభుత్వం ధరణి తెచ్చిన తర్వాత మూడేండ్లు దాటినా రూల్స్ ఫ్రేమ్ చేయకపోవడంతో తప్పులు జరిగాయి. ఆ తప్పుల్ని ప్రజలపై బలవంతంగా రుద్దింది. ఇప్పుడు అలా జరగకుండా మూడు నెలల్లోనే భూభారతి చట్టానికి రూల్స్ ఫ్రేమ్ చేస్తాం. రూల్స్ ఫ్రేమ్ అయిన తర్వాత గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు పెట్టి అధికారులతో పాటు నేను, సహచర ప్రజాప్రతినిధులతో కలిసి పరిష్కారాన్ని యుద్ధ ప్రాతిపదికన కనుగొంటాం” అని ఆయన ప్రకటించారు. గత ప్రభుత్వం మాటలతో మభ్య పెట్టిందని.. తమ ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని చట్టాలను కలిపి ఒకే చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నదన్నారు. 

హరీశ్​రావు సలహాలు కూడా తీసుకున్నాం

‘‘వేలాది పుస్తకాలు చదివిన మేధావి 2020 ఆర్వోఆర్ చట్టం ద్వారా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌‌తో మూడేండ్లలోనే లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి. రెవెన్యూ అధికారుల స్థాయిలో పరిష్కారం కావాల్సినవి కోర్టుల దాకా వెళ్ళాల్సి పరిస్థితి వచ్చింది. కొండ‌‌నాలుక‌‌కు మందేస్తే ఉన్న నాలిక ఊడింద‌‌న్నట్లు ధ‌‌ర‌‌ణి పోర్టల్‌‌తో లెక్కలేన‌‌న్ని ఇబ్బందులు  ప్రజలకు ఎదురయ్యాయి” అని మంత్రి పొంగులేటి అన్నారు. నాలుగు గోడల మధ్య కూర్చుని వాళ్లకు(బీఆర్​ఎస్​ వాళ్లకు) అనుకూలంగా ఉండేలా ధరణిని అప్పటి పాలకులు బలవంతంగా జనం నెత్తిమీద రుద్దారని ఆయన మండిపడ్డారు.  మానవ సంబంధాలను కూడా ధరణి దెబ్బతీసిందన్నారు ప్రజలను తిప్పలు పెడ్తున్న ధ‌‌ర‌‌ణిని బంగాళాఖాతంలో వేస్తామని ఎన్నికల సమయంలో చెప్పినట్లే ఇప్పుడు చేసి చూపిస్తున్నామని..

ఒక్క గుంట భూమి ఉన్న వారు కూడా త‌‌మ‌‌ను న‌‌మ్మార‌‌ని, వారి న‌‌మ్మకాన్ని నిల‌‌బెట్టేందుకు ఆర్వోఆర్ 2020ను పూర్తిగా ప్రక్షాళ‌‌న చేసి భూభార‌‌తిని రూపొందించామ‌‌ని ఆయన తెలిపారు. ‘‘మేం ఆగ‌‌స్టు 2న ముసాయిదాను ప్రవేశ‌‌పెట్టడ‌‌మేగాక ప్రత్యేకంగా 40 రోజుల పాటు వెబ్ సైట్‌‌లో పెట్టి ప్రజా ప్రతినిధులు, మేధావులు, విశ్రాంత అధికారుల స‌‌ల‌‌హాలు సూచ‌‌న‌‌లు స్వీకరించి కొత్త చ‌‌ట్టానికి రూప‌‌క‌‌ల్పన చేశాం.  

మాజీ మంత్రి హ‌‌రీశ్​రావు 7 పేజీలు, వినోద్‌‌రావు 5 పేజీల స‌‌ల‌‌హాలు, సూచ‌‌న‌‌లు చేశారు. వాటిని కూడా ప‌‌రిగ‌‌ణ‌‌న‌‌లోకి తీసుకున్నాం” అని వివరించారు.  33 జిల్లాల్లో ఒక్కోరోజు ప్రత్యేక చ‌‌ర్చావేదిక‌‌లు నిర్వహించి, అంద‌‌రి అభిప్రాయాలు తీసుకున్నామ‌‌ని చెప్పారు. 18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్‌‌ల‌‌ను అధ్యయ‌‌నం చేసి, ఉత్తమ విధానాల‌‌ను క్షుణ్ణంగా ప‌‌రిశీలించి, వాటిని భూభార‌‌తిలో పొందుప‌‌రిచామ‌‌న్నారు. 

ALSO READ : కేసీఆర్ ఫాంహౌస్కు రోడ్లు వేసుకున్నారు.. ఓఆర్ఆర్ అమ్ముకున్నారు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

గ్రామానికో రెవెన్యూ అధికారి..

రాష్ట్రంలో 10,956 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని.. ప్రతి గ్రామానికి రెవెన్యూ శాఖ నుంచి ఒక అధికారిని నియమిస్తామని.. ఇందులో కొందరిని డైరెక్ట్​ రిక్రూట్మెంట్​ ద్వారా, మరికొందరిని పూర్వ వీఆర్వోల నుంచి తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ప్రకటించారు. ‘‘గత సీఎంకు ఒక అర్ధరాత్రి పుట్టిన ఆలోచనతో వీఆర్వోలు, వీఆర్​ఏల వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు. గ్రామ రెవెన్యూ యంత్రాంగాన్ని ఆగం చేశారు” అని ఆయన మండిపడ్డారు.