హైదరాబాద్​లో రియల్​ ఎస్టేట్​పెరుగుతున్నది

  • ప్రతిపక్షాల ప్రచారంలోనిజం లేదు: పొంగులేటి
  • వరదలతో అమరావతికి ఇన్వెస్టర్లు పోయే పరిస్థితి లేదు
  • అసెంబ్లీకి కేసీఆర్  వస్తే మాట్లాడాలని ఉందని వెల్లడి 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రతిపక్షాలు ప్రచారం చేసినట్లుగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్  పడిపోవడం లేదని, ఇంకా పెరుగుతున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అమరాతికి పెట్టుబడులు పెరుగుతాయని మొదట్లో అనుకున్నారని.. కాకపోతే విజయవాడలో వరదల తరువాత ఇన్వెస్టర్ల మనసు హైదరాబాద్  వైపే తిరిగిందని ఆయన పేర్కొన్నారు. -హైడ్రాపై మొదట్లో తప్పుడు ప్రచారం జరిగిందని, అందువల్లే ప్రజలు ఆందోళనకు గురయ్యారని, ప్రస్తుతం హైడ్రా భయం ప్రజల్లో లేదన్నారు. 

ప్రతిపక్షాలు చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఇప్పుడు తేలిందన్నారు. సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర అప్పులపై మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు నిజాలు తెలుసుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్ర అప్పులు రూ.7.20 లక్షల కోట్లు అని వెల్లడించారు. ఆర్బీఐ రిపోర్ట్​లో నేరుగా  తీసుకున్న అప్పులే ఉన్నాయని, మరి కార్పొరేషన్  లోన్లతో కలిపి మొత్తం లెక్కలు ఎవరు చెప్తారని నిలదీశారు.

ఆదాయం లేకుండా కార్పొరేషన్  పేరుతో చేసే అప్పులు సైతం ప్రభుత్వ ఖాతాల్లోకే వస్తాయనే విషయం కేటీఆర్ కు తెలియదా అని ఎద్దేవా చేశారు. శాసనసభలో ఎవరి పాత్ర వారిదేనని, ప్రివిలెజ్  మోషన్ ఇవ్వడం వాళ్ల హక్కంటూఆయన చెప్పారు. అసెంబ్లీకి కేసీఆర్  రాకుండా కొసరు నేతలను పంపుతున్నారని మంత్రి మండిపడ్డారు. అసెంబ్లీకి కేసీఆర్  వస్తే ఆయనతో కూర్చొని మాట్లాడాలనే కోరిక తనకు వ్యక్తిగతంగా ఉందని పొంగులేటి చెప్పారు.ఇక  స్టాంప్స్  అండ్  రిజిస్ట్రేషన్  డిపార్ట్ మెంటులో ఆదాయం తగ్గలేదని, ఇంకా పెరుగుతోందని మంత్రి చెప్పారు. కాంగ్రెస్  ఏడాది పాలనా కాలంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు.