అందరి భాగస్వామ్యంతో  సిద్దిపేట జిల్లా అభివృద్ధికి కృషి :మంత్రి కొండా సురేఖ 

  • ఇన్​చార్జి మంత్రి కొండా సురేఖ 

సిద్దిపేట, వెలుగు:  పార్టీలకతీతంగా సిద్దిపేట జిల్లా అభివృద్దికి కృషి చేస్తానని జిల్లా ఇన్​చార్జి మంత్రి కొండా సురేఖ అన్నారు.  బుధవారం కలెక్టరేట్‌లో మూడు గంటలకు పైగా జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై మంత్రి కొండా సురేఖ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మున్సిపల్ చైర్మన్, అధికారులతో కలిసి సమీక్షించారు. వైద్య ఆరోగ్య శాఖ పై చర్చ సందర్భంగా ప్రైవేటు ఆసుపత్రుల నుంచి నిబంధనల ప్రకారం.. సీఎస్ఆర్ ఫండ్స్ ను వసూలు చేయాలని కలెక్టర్ ను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.  

ప్రైవేటు ఆసుపత్రుల్లో వారానికి ఎన్ని సార్లు తనిఖీలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం లేని ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ ఓను ఆదేశించారు.   సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు మాట్లాడుతూ..  వ్యవసాయ శాఖలో రెగ్యులర్ డీఎఓ లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.  వానాకాలం సీజన్‌లో జీలుగ విత్తనాల కొరత ఏర్పడిందన్నారు. ఎరువుల బఫర్ స్టాక్ ను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు.   నిర్మాణం పూర్తయిన ఆయుష్ ఆసుపత్రిని ప్రారంభించాలని మంత్రిని కోరారు.  

ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ..  రైతులకు ఇచ్చే పనిముట్ల నిధులను ఇతర అంశాలకు మళ్లించారని ఇకపై అలా జరగకుండా చూడాలని కోరారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, పల్లారాజేశ్వర్ రెడ్డి,  ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి పాల్గొన్నారు.