శ్రీతేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్కు

  • కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అందజేసిన మంత్రి వెంకట్ రెడ్డి 
  • కిమ్స్​లో చికిత్స పొందుతున్న బాలుడికి పరామర్శ

సికింద్రాబాద్, వెలుగు:  సంధ్య టాకీస్ వద్ద తొక్కిసలాటలో గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌‌ను శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. శ్రీతేజ్ తండ్రికి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ.25 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండబోవని స్పష్టం చేశారు. టికెట్ల రేట్లు కూడా పెంచబోమని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే సినిమాలు వస్తే బెనిఫిట్ షోలపై ఆలోచిస్తామన్నారు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌‌‌‌కు వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. థియేటర్‌‌‌‌కు వెళ్లేందుకు హీరో అనుమతి కోరితే పోలీసులు రిజెక్ట్ చేశారని.. అయినా వెళ్లడం వల్లే ఇన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు.  

బౌన్సర్లు అందరినీ తోసేశారు..

పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా అల్లు అర్జున్ ఓపెన్‌‌ టాప్‌‌ కారుపైకెక్కి చేతులు ఊపుకుంటూ సంధ్య థియేటర్ వద్దకు వచ్చారని మంత్రి వెంకట్‌‌ రెడ్డి అన్నారు. అల్లు అర్జున్‌‌తో పాటు హీరోయిన్, ఇతర యూనిట్ సభ్యులు  రావడం.. హీరో బౌన్సర్లు అందరినీ తోసేయడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. శ్రీతేజ్‌‌ ఆహారం తీసుకునే పరిస్థితి కూడా లేదని, చిన్నారి రికవరీ అయ్యేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారన్నారు. శ్రీతేజ్ చికిత్సకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. రేవతి భర్త భాస్కర్‌‌‌‌కు ధైర్యం చెప్పడానికే తాను హాస్పిటల్‌‌కు వచ్చానన్నారు.- భాస్కర్‌‌‌‌  పిల్లలకయ్యే ఖర్చు కూడా చూసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.

పుష్ప2లో ఏముందో అర్థం కాలే..

పుష్ప2 సినిమా తాను కూడా చూశానని, అందులో ఏముందో అర్థం కాలేదని మంత్రి అన్నారు. అదేమైన దేశ భక్తికి, తెలంగాణ చరిత్రకి సంబంధించిన సినిమానా? అని ప్రశ్నించారు. మూడు గంటల సినిమా సమయంలో చాలా పనులు చేసుకోవచ్చని, ఇకపై చారిత్రక, తెలంగాణ సినిమా తప్ప.. తెలుగు సినిమాలు చూడనన్నారు. మెసేజ్ ఓరింటెడ్ సినిమాలు మినహా ఇప్పుడు వస్తున్న సినిమాలతో యువత చెడిపోతుందన్నారు. హీరోలు రూల్స్‌‌ ప్రకారం నడుచుకోవాలని సూచించారు. 

పోలీసులు పర్మిషన్లు ఇవ్వకపోతే బయటకి వెళ్లొద్దని, ఓపెన్ టాప్ కార్లలో తిరగవద్దని, ఇంకోసారి ఇలాంటి చర్యలు రిపీట్ కావొద్దని హెచ్చరించారు. సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులు లేకుండా ప్రోత్సహిస్తామని, అందరూ హీరోలు, ప్రొడ్యూసర్లు కోఆపరేట్ చేయాలన్నారు.కాగా, శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటిలేటర్ సాయం లేకుండానే శ్వాస తీసుకుంటున్నాడని డాక్టర్లు బులెటిన్​లో వివరించారు.