సిక్స్​వే రోడ్లకు 10 వేల కోట్లు కేటాయించినం : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

  • బీహెచ్ఈఎల్​ జంక్షన్​లో ఫ్లై ఓవర్​కు రూ.172.56 కోట్లు ఖర్చుపెడుతున్నం
  • ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు వేరే కాంట్రాక్టర్​కు ఇచ్చామని వెల్లడి

హైదరాబాద్ సిటీ, వెలుగు: బీహెచ్ఈఎల్ నుంచి సంగారెడ్డి వరకు నిర్మించే సిక్స్​వే రోడ్ల నిర్మాణానికి రూ.10 వేల కోట్లు కేటాయించామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. బీహెచ్ఈఎల్ జంక్షన్​లో నిర్మిస్తున్న ఫ్లైఓవర్​కు రూ.​172.56 కోట్లు ఖర్చుపెడుతున్నామని చెప్పారు. దీనిని మార్చి 2025 నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. గురువారం మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ కోదండరాం ఎన్​హెచ్​65 గురించి అడిగారు. ఇది  ముఖ్యమైన జాతీయ రహదారి కావడంతో ఈ రూట్​లో ప్రయాణించడం వాహనదారులకు కష్టంగా మారిందని, సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తిచేయాలని కోరారు. 

మంత్రి సమాధానమిస్తూ లింగంపల్లి క్రాస్​ రోడ్డు నుంచి అమీన్ పూర్​ వెళ్లే రోడ్డులో బీహెచ్ఈఎల్​ జంక్షన్​ వద్ద (ఎన్​హెచ్6)  400 మీటర్ల పొడవునా పనులు జరుగుతున్నాయని, దీంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్​కు అంతరాయం కలుగుతోందన్నారు. అయితే, రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కరీంనగర్  జాతీయ రహదారిలో ఎలివేటెడ్​ కారిడార్​ పనులకు స్థల సేకరణ ఎంత వరకు వచ్చిందని కాంగ్రెస్​ సభ్యుడు జీవన్​రెడ్డి ప్రశ్నించగా, ఎలివేటెడ్​ కారిడార్​ నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ పనులు జరుగుతున్నాయని, డీపీఆర్​ సిద్ధమవుతోందన్నారు. 

బీఆర్ఎస్​ సభ్యుడు వేణుగోపాలచారి మాట్లాడుతూ, ఉప్పల్ ​నుంచి వరంగల్​ మీదుగా వెళ్లడం కష్టంగా మారిందని, అక్కడ కడుతున్న ఫ్లైఓవర్​ పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. మంత్రి స్పందిస్తూ  ఉప్పల్​ ఫ్లైఓవర్​ పనులను వేరే కాంట్రాక్టర్​తో చేయిస్తున్నామని వెల్లడించారు. కుత్బుల్లాపూర్​ రోడ్డు అధ్వానంగా మారిందని బీఆర్ఎస్​ సభ్యుడు శేరిసుభాష్​ రెడ్డి తెలిపారు. బాచుపల్లి నుంచి మల్లంపేట, భౌరంపేట రోడ్ల నిర్మాణం కూడా అస్తవ్యస్థంగా ఉందని, ఈ రూట్​లో వాటర్​లైన్ల పనులకు అడ్డంకిగా మారిందన్నారు. మంత్రి సమాధానమిస్తూ వాటర్​ లైన్లు తరలించేందుకు అధికారులను ఆదేశిస్తామన్నారు.