ఆరు నెలల్లో టిమ్స్ను అందుబాటులోకి తెస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి

  • జూన్ ​నెలలో ప్రారంభోత్సవం ఉంటుంది
  • ఏడాదిలో ఎల్ఓసీలతో రూ.1,600 కోట్లు ఇచ్చాం
  • ఎవరు అడ్డొచ్చినా మూసీ ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు
  • మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి

దిల్ సుఖ్​నగర్, వెలుగు: చైతన్యపురిలో నిర్మాణంలో ఉన్న ఎల్బీనగర్​టిమ్స్​హాస్పిటల్​ను ఆరు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వచ్చే జూన్​లో ప్రారంభోత్సవం ఉంటుందని స్పష్టం చేశారు. 7 అంతస్తులు పూర్తయ్యాయని, మరో 7 అంతస్తులు నిర్మించాల్సి ఉందన్నారు. సోమవారం ఆయన హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సిటీకి నలుమూలలా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు.

పేదలకు ఉచిత వైద్యం, విద్య అందించడమే కాంగ్రెస్​ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏడాదిలో ఎల్ఓసీ(లెటర్​ఆఫ్ క్రెడిట్)​ కింద రూ.1,600 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆపదలో ఉన్న పేదలకు 24 గంటల్లో రూ.3లక్షల వరకు ఎల్ఓసీ ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వనికే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వంలో పేదలకు ఎల్ఓసీలు ఇవ్వడం ఆపేశారని, మెడికల్​రీయింబర్స్​మెంట్​ను ఆరు నెలల తర్వాత ఇచ్చేవారని విమర్శించారు.

గోషామహల్​పోలీస్​స్టేడియంలో ఉస్మానియా హాస్పిటల్​కొత్త బిల్డింగ్​నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తుచేశారు. అదే ఆవరణలో పోలీస్ స్టేషన్, దేవాలయం, మసీద్ లకు స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీని రూ.5 లక్షలు నుంచి రూ.10 లక్షలకు పెంచామని చెప్పారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా త్వరలో మూసీ ప్రాజెక్టుకు టెండర్లు పిలుస్తామన్నారు. రాష్ట్ర రోడ్​డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఫైనాన్స్ కమిటీ సభ్యుడు సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.