2025 డిసెంబర్​లో మూడు ‘టిమ్స్’ ఓపెనింగ్: మంత్రి వెంకట్​రెడ్డి

  • చాలా వేగంగా నిమ్స్​ కొత్త బ్లాక్ పనులు
  • టిమ్స్ పూర్తయితే నిమ్స్, గాంధీ, ఉస్మానియాపై భారం తగ్గుతుంది
  • ఆగస్ట్ 31లోగా అల్వాల్ టిమ్స్ పూర్తి చేయాలని ఆదేశం
  • పనులను పరిశీలించిన ఆర్ అండ్ బీ మంత్రి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో ప్రభుత్వం నిర్మిస్తున్న మూడు టిమ్స్ హాస్పిటల్స్ ను ఈ ఏడాది డిసెంబర్ లో ప్రారంభిస్తామని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ప్రకటించారు. పెద్ద సంఖ్యలో రోగులు వస్తుండటంతో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ హాస్పిటల్స్ పై ఒత్తిడి పెరిగిందని మంత్రి అన్నారు. త్వరలో గోషామహాల్ లో ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని, పంజాగుట్టలో నిమ్స్ హాస్పిటల్ కొత్త బ్లాక్ పనులు చాలా స్పీడ్​గా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.

పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మంగళవారం అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ ను ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ తో కలిసి మంత్రి వెంకట్​రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ రూ.897 కోట్లతో నిర్మిస్తున్న టిమ్స్ పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయని, ఈ ఏడాది ఆగస్ట్ 31లోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం వాస్తు మార్పులు చేయడంతో హాస్పిటల్స్ నిర్మాణం లేట్ అయిందని మంత్రికి కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు వైద్యం అందించే టిమ్స్ పనుల్లో క్వాలిటీతో చేపట్టాలని కంపెనీకి మంత్రి సూచించారు. పేషెంట్ల బంధువులు ఉండేందుకు ధర్మశాల ఎందుకు నిర్మించటం లేదని, ఎల్ బీ నగర్, సనత్ నగర్ టిమ్స్ లో నిర్మిస్తున్నపుడు ఇక్కడ ఎందుకు నిర్మించటం లేదని కంపెనీ ప్రతినిధులను మంత్రి వెంకట్​రెడ్డి ప్రశ్నించారు. ఈ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ఇందుకు అవసరమయ్యే ఫండ్స్ రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు. కాగా,   ఫార్ములా–ఈ  కార్​ రేస్ కేసులో కేటీఆర్ విచారణపై మీడియా ప్రశ్నించగా హైకోర్టులో ఉన్న అంశంపై తాను మాట్లాడడని, చట్టం తన పని తాను చేసుకుంటుందని వెంకట్​రెడ్డి స్పష్టం చేశారు.