తెలంగాణలో బెనిఫిట్ షోలు పుష్ప2 తోనే స్టాప్: మంత్రి కోమటి రెడ్డి

పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటన ఎఫెక్ట్ ఇప్పుడు మొత్తం తెలుగు ఇండస్ట్రీపై పడింది. తెలంగాణలో ఇకనుంచి బెనిఫిట్ షోలు పుష్ప2 తోనే స్టాప్ అని మంత్రి కోమటిరెడ్డి వెంటకరెడ్డి సంచలన ప్రకటన చేశారు.  బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంచుకోవడం ఇక నుంచి ఉండవని చెప్పారు. ఏవైనా దేశభక్తి, చరిత్ర, తెలంగాణ ఉద్యమం తదితర ప్రాముఖ్యతో కూడిన సినిమాల విషయంలో ఆలోచిస్తామని తెలిపారు. 

కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ.25 లక్షల ఆర్థిక సాయం

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కోమాలో ఉన్న శ్రీతేజ్ ను పరామర్శించిన అనంతరం వారి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చికిత్సకు కావాల్సిన ప్రతి రూపాయి ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 25 లక్షల రూపాయల చెక్ అందజేశారు మంత్రి కోమటి రెడ్డి. 

శ్రీతేజ్ ఆరోగ్యంపై మంత్రి ఏమన్నారు

శ్రీతేజ్ పరిస్థితి చూస్తే చాలా బాధేస్తుందని, త్వరగా కోలుకునేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. శ్రీతేజ్ కోలుకోవడానికి ఇంకా ఏడాది, రెండేళ్లు పట్టవచ్చని డాక్టర్లు చెపుతున్నారని అన్నారు. ఒకవేళ బతికితే అతడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేక పోతున్నానని, అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. 

సంధ్య థియేటర్ తొక్కిసలాటకు కారణం 

పుష్ప2 సినిమాకు పర్మిషన్ రిజెక్ట్ చేసిన తర్వాత కూడా అల్లు అర్జున్ రావడం, రోడ్ షో చేయడం వల్లనే ఈ ఘటన జరిందని మంత్రి పునరుద్ఘాటించారు. వద్దన్నా కూడా వచ్చి చేతులు ఊపడం, రోడ్ షో చేయడంతోనే ఈ ఘటన జరిగిందని తెలిపారు. అల్లు అర్జున్ ఏసీపీ చెప్పినా కూడా వినలేదని... సినిమా పూర్తయ్యే వరకు ఉండి వెళ్లాడని.. వెళ్లే సమయంలో కూడా చేయి ఊపుతూ రోడ్ షో చేశాడని అన్నారు.