చివరి ఆయకట్టు వరకు సాగు నీరందిస్తాం : జూపల్లి కృష్ణారావు

వీపనగండ్ల, వెలుగు: ఉమ్మడి వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లోని జూరాల, బీమా ఆయకట్టు భూములకు సింగోటం- గోపల్ దిన్నె కెనాల్ తో సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం మండలంలోని తూముకుంట గ్రామంలో కాంగ్రెస్  పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సింగోటం రిజర్వాయర్  నుంచి గోపాల్ దిన్నె రిజర్వాయర్  వరకు కెనాల్​ నిర్మాణం కోసం నిధులు మంజూరైనా, పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. 

ఏడాదిలోగా కాలువ నిర్మాణాన్ని పూర్తి చేయించి సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. గతంలో కొందరు రాజకీయాల కోసం సంక్షేమ పథకాలు అందకుండా చేశారని, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని తెలిపారు. రైతు భరోసా కింద మిగిలిన రైతులకు డబ్బులు జమ చేస్తామని, ఎలాంటి అపోహలు పడొద్దని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. 

ఎవరూ పైరవీకారులను ఆశ్రయించవద్దని, డబ్బులు కూడా ఇవ్వవద్దని సూచించారు. గుడిసెల్లో ఉంటూ సెంటు​భూమి కూడా లేని వారిని ముందుగా గుర్తించి ఇందిరమ్మ ఇండ్లను తానే మంజూరు చేయిస్తానని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కల్యాణలక్ష్మి, ఆరోగ్యశ్రీ స్కీముల్లో కొందరు బోగస్  పత్రాలు పెట్టి డబ్బులు కాజేశారని, వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. గోదల బీరయ్య యాదవ్, కిషన్, వెంకటరెడ్డి, బాల్ రెడ్డి, గంగిరెడ్డి, రవీందర్ రెడ్డి, నారాయణరెడ్డి, రఘునాథ్ రెడ్డి, వాలా మదన్మోహన్​రావు, సుదర్శన్ రెడ్డి, రామిరెడ్డి, లోడుగు రాజు, రాంబాబు పాల్గొన్నారు.