అందరికీ రైతు భరోసా అందిస్తాం

మక్తల్, వెలుగు: మక్తల్  మార్కెట్​ డెవలప్​మెంట్​కు అవసరమైన నిధులను సీఎం రేవంత్​రెడ్డి సమకూరుస్తారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మక్తల్  మార్కెట్  కమిటీ కొత్త పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి మక్తల్  ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో నియోజకవర్గంలో డబ్బులు పెట్టి పదవులు కొనే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర అప్పులపై అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్  నాయకులు అసత్యాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను  కాంగ్రెస్  ప్రభుత్వం అమలు చేస్తుంటే, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మక్తల్  నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. 

రైతు భరోసా అందరికీ వస్తుందని, శనివారం జరిగే క్యాబినెట్  భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తనపై అసత్య ఆరోపణలు చేసేవారి కుట్రలను తిప్పి కొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తాను గెలిచిన తరువాత నియోజకవర్గానికి రూ.300 కోట్ల నిధులు తీసుకువచ్చానని, ఎమ్మెల్యే క్యాంప్  ఆఫీసును కోర్టుకు ఇచ్చానని గుర్తు చేశారు. మార్కెట్  చైర్ పర్సన్  రాధా లక్ష్మారెడ్డి, వైస్  చైర్మన్ తో పాటు పాలకవర్గ సభ్యులను సన్మానించారు.

 దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్​పర్సన్  వనజ, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి, కుంభం శివకుమార్ రెడ్డి, బాల కృష్టారెడ్డి, దేవర మల్లప్ప పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి, ఎమ్మెల్యేలు పడమటి ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

మాగనూర్: నెరడగం గ్రామస్తులు నిరాశ చెందవద్దని, త్వరలోనే గ్రామంలోని అన్ని ఫ్యామిలీలకు 200 గజాల ఇంటి స్థలం ఇప్పించేందుకు కృషి చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. మండలంలోని ముంపునకు గురవుతున్న నెరడగం గ్రామాన్ని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి పరిశీలించారు. 

గ్రామంలో కూలిపోయిన ఇంటిని పరిశీలించారు. ఇంటి స్థలం కేటాయిస్తామని, గ్రామస్తులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇండ్ల స్థలాల పంపిణీ కోసం నోటిఫికేషన్  జారీ చేయాలని కలెక్టర్  సిక్తా పట్నాయక్ ను ఫోన్ లో ఆదేశించారు.