అధికారుల్లో జవాబుదారీతనం పెరగాల్సిందే : జూపల్లి కృష్ణారావు

  • డెవలప్​మెంట్​లో జిల్లా రాష్ట్రానికి రోల్​మోడల్​ కావాలి
  • రివ్యూ మీటింగ్ లో మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలు

నాగర్​కర్నూల్, వెలుగు: సాగునీటి రంగం, రెవెన్యూ, విద్యుత్, వైద్య, విద్యా రంగాల్లో నాగర్​ కర్నూల్​ జిల్లా రాష్ట్రానికే రోల్​మోడల్​ కావాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా పాలన ఉండాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్​ మీటింగ్​ హాల్​లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్​రెడ్డి, గోరటి వెంకన్న, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్​రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కలెక్టర్​ బదావత్​ సంతోష్​ పాల్గొన్నారు. ఇరిగేషన్, ధరణి, విద్యుత్, వైద్యం, సివిల్​సప్లై, మెడికల్​ కాలేజీపై చర్చించారు.

కృష్ణానదికి వరద వచ్చేలోపు కేఎల్ఐ మొదటి లిఫ్ట్​ ఎల్లూరులో రెండు పంప్​ల రిపేర్లు పూర్తి చేసి పని చేసేలా చూడాలని సీఈ విజయ్​కుమార్​రెడ్డిని మంత్రి ఆదేశించారు. కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీ నెట్​వర్క్​లో పూడిక, పిచ్చి మొక్కలు తొలగించి నీళ్లు పారేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాల్వల రిపేర్లకయ్యే ఖర్చును కాంట్రాక్టర్ల బిల్లుల నుంచి మినహాయించాలని సూచించారు.

అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ కేఎల్ఐ కింద రిజర్వాయర్లు లేక ఎత్తిపోసిన నీళ్లు డిండి ప్రాజెక్టు నుంచి తిరిగి కృష్ణానదిలో కలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ సిర్సవాడ అక్విడెక్ట్​ నుంచి మాడ్గుల మండలం చివరి ఆయకట్టు వరకు నీరు పారేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ముందు నీళ్లు దుంకిన మార్కండేయ లిఫ్ట్ ఎందుకు బంద్​ పెట్టారని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​రెడ్డి ప్రశ్నించారు. రూ.25 కోట్లు ఖర్చు చేసి భూసేకరణ చేయకుండా ప్రారంభించి, గంటకే బంద్​ పెట్టారని విమర్శించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు దాటినా తమ నోటీస్​కు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు.

ధరణి సమస్యలపై నిలదీత..

ధరణి సమస్యలతో రైతులు తహసీల్దార్​ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని మంత్రి, ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో 9,500 దరఖాస్తులు పెండింగ్​లో ఉంటే 5 రోజుల్లో 1,439 పరిష్కరించామని కలెక్టర్​ తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గంలో పోడు, సాదా బైనామా పట్టా సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మూడు తరాలుగా సాగులో ఉన్నవారికి పట్టాలు ఇవ్వకుండా, సంబంధం లేని వారికి ఎవరిచ్చారో అర్థం కావడం లేదన్నారు. మాచారం, బక్కలింగాయపల్లి, మాధవానిపల్లి, తాటిచెలకలు, చెన్నారం గ్రామాల్లో ఈ సమస్య ఉందన్నారు.

ఓపికను పరీక్షించవద్దు..

రైతుల సమస్యలపై ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తే ఏఈలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్​రెడ్డి పేర్కొన్నారు. డాక్టర్లు,ఇంజనీర్లమైన తాము ఎమ్మెల్యేలుగా ఉన్నామని, తమ ఓపికను పరీక్షించవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్​ కాలేజీ, జిల్లా హాస్పిటల్​కు భగీరథ కనెక్షన్​ ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. జిల్లా ఆసుపత్రికి తన నిధుల నుంచి రూ.50 లక్షలు ఇస్తానని తెలిపారు. అడిషనల్​ కలెక్టర్లు సీతారామరావు, శ్రీనివాసులు, డీఎఫ్​వో రోహిత్​ పాల్గొన్నారు

దివ్యాంగులకు అండగా ఉంటాం

నాగర్ కర్నూల్ టౌన్: దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కలెక్టరేట్  ఆవరణలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 30 మంది లబ్ధిదారులకు రూ.20 లక్షల విలువైన పరికరాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ  కూచుకుళ్ల దామోదర్ రెడ్డి సతీమణి కూచుకుళ్ల సౌభాగ్యమ్మ పేరుపై మెడికల్  కాలేజీకి అందజేసిన బస్సును మంత్రి ప్రారంభించారు. మెడికల్  కాలేజ్ స్టూడెంట్స్​ కోసం బస్  డొనేట్  చేసినట్లు ఎమ్మెల్సీ తెలిపారు.