నాణ్యమైన విద్య, భోజనం అందించాలి

  • కేజీబీవీ స్టూడెంట్లు, సిబ్బందితో మంత్రి సమావేశం    
  •  పెంట్లవెల్లి స్కూల్​ను సందర్శించిన కలెక్టర్

కొల్లాపూర్, వెలుగు : కేజీబీవీల్లో చ‌దువుతున్న విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనం అందించాల‌ని, నిర్లక్ష్యం చేస్తే చ‌ర్యలు త‌ప్పవ‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హెచ్చరించారు. పెంట్లవెల్లి కేజీబీవీలో ఫుడ్​ పాయిజన్​ ఘ‌ట‌న‌ను మంత్రి సీరియ‌స్ గా తీసుకున్నారు. సోమ‌వారం  కొల్లాపూర్, కోడేరు, పెద్ద కొత్తపల్లి కేజీబీవీ స్టూడెంట్లు, సిబ్బందితో పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో అవ‌గాహ‌న స‌దస్సు నిర్వహించారు.  భ‌విష్యత్ లో ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. అధికారులతో పాటు వంట సామగ్రి సప్లై చేసే ఏజెన్సీల‌పై క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

విద్యార్థినులకు నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందించే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. స్కూల్స్, హాస్టళ్లలో సౌలతులు కల్పించేందుకు నిధులు కేటాయిస్తాన‌ని తెలిపారు. కుళ్లిపోయిన కూర‌గాయలు స‌ప్లై చేసే ఏజెన్సీలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారుల‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటిని శుద్ధి చేయాల‌ని, టెస్టింగ్  మెషీన్​ ఏర్పాటు చేయాల‌ని సూచించారు. విద్యార్థులతో మాట్లాడి కేజీబీవీల్లో సౌలతులను అడిగి తెలుసుకున్నారు.

ఏమైనా స‌మ‌స్య ఉంటే త‌న‌తో పాటు క‌లెక్టర్ కు ఫోన్  చేయాల‌ని చెప్పారు. అనంతరం మున్సిపల్  ఆఫీస్ లో చైర్ పర్సన్  మేకల రమ్య అధ్యక్షతన అధికారులు, కౌన్సిలర్లతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. పట్టణ అభివృద్ధికి రూ.కోటి ఇస్తానని హామీ ఇచ్చారు. క‌లెక్టర్  బ‌దావ‌త్  సంతోష్, డీఈవో గోవిందరాజులు పాల్గొన్నారు.

కఠిన చర్యలు తీసుకుంటాం

పెంట్లవెల్లి కేజీబీవీని కలెక్టర్‌  బదావత్  సంతోష్  సోమవారం పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులు అనారోగ్యానికి గురి కావడానికి గల కారణాలు తెలుసుకుని, రిపోర్టు చేయాలని డీఎంహెచ్ వోను ఆదేశించారు. ఎస్​వోపై చర్యలు తీసుకోవాలని, వంట సిబ్బందిని మార్చాలన్నారు. వంటగదిని పరిశీలించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్వో ప్లాంట్  ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

విద్యార్థులు పలు సమస్యలు కలెక్టర్  దృష్టికి తీసుకురాగా, వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు కొల్లాపూర్  ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్కూల్​లో మెడికల్  క్యాంప్​ ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్​కు విద్యార్థి సంఘాలు, బీజేపీ నాయకులు ఎస్ వో స్వప్నను సస్పెండ్  చేయాలని వినతిపత్రం అందజేశారు. డీఎంహెచ్ వో రాజ్యలక్ష్మి, ఆర్డీవో నాగరాజు, ఎస్ఐ రామన్ గౌడ్, డాక్టర్  రోహిత్  పాల్గొన్నారు.

చివరి ఆయకట్టు వరకు సాగు నీరందిస్తాం

పాన్​గల్ : చివరి ఆయకట్టు  వరకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని మంత్రి  జూపల్లి కృష్ణారావు తెలిపారు. మండలంలోని కదిరేపాడు, షాగాపూర్, మాధవరావుపల్లి గ్రామాల్లో పర్యటించి, భీమా డి8  కాలువ ను పరిశీలించారు. చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందడం లేదని రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ ప్రతి ఎకరానికి  సాగు నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్​లో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కాంపౌండ్​వాల్, టాయిలెట్స్, డ్రైనేజీల కోసం రూ.25 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రవి, వెంకటేశ్ నాయుడు, రాము యాదవ్, పుల్లారావు, ముంత భాస్కర్ యాదవ్, బ్రహ్మ హైమావతి, హనుమంతు, నిరంజన్, హెచ్ఎం నరేందర్  పాల్గొన్నారు.