రాహుల్​ను ప్రధాని చేయడమే లక్ష్యం: మంత్రి జూపల్లి

చిన్నంబావి, వెలుగు: దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్  శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. నాగర్ కర్నూల్  కాంగ్రెస్   క్యాండిడేట్​ మల్లు రవిని గెలిపించాలని కోరుతూ ఆదివారం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్  క్యాండిడేట్లకు వచ్చిన మెజార్టీ కంటే రెండింతల మెజార్టీతో ఎంపీగా మల్లు రవిని గెలిపించాలని పిలుపునిచ్చారు. 

తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు రాష్ట్రంలోని అన్ని లోక్​సభ స్థానాలను గెలిచి గిఫ్ట్​గా ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్  ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ పూర్తి స్థాయిలో అమలు చేస్తుందన్నారు. అధికారం, అహంకారంతో విర్రవీగిన బీఆర్ఎస్, బీజేపీ పాలకులకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, పార్లమెంట్​ ఎన్నికల్లో అదే తీర్పు పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని మతోన్మాద బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుదామని పిలుపునిచ్చారు. ఎన్నికల తర్వాత గ్రామ గ్రామాన తిరిగి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కాంగ్రెస్  నాయకులు కల్యాణ్ రావు, రామచంద్రారెడ్డి, కృష్ణ ప్రసాద్ యాదవ్, బీచుపల్లి యాదవ్, శ్రీలత రెడ్డి, ఇందిర పాల్గొన్నారు.