పీఆర్ఎల్ఐ భూ సేకరణపై నివేదిక ఇవ్వాలి... మంత్రి జూపల్లి కృష్ణారావు

వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలోని భీమా, కల్వకుర్తి, పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్  ఇరిగేషన్  ప్రాజెక్ట్​కు సంబంధించిన భూ సేకరణపై వారంలోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎక్స్​జ్​ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కొల్లాపూర్  నియోజకవర్గంలోని వీపనగండ్ల, చిన్నంబావి, పాన్​గల్  మండలాలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంగళవారం  కలెక్టరేట్​ మీటింగ్​ హాల్​లో కలెక్టర్​ తేజస్​ నందలాల్​ పవార్​తో కలిసి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 700 ఎకరాలకు అవార్డ్​ పాస్ చేయాల్సి ఉందని, భూసేకరణకు సంబంధించి ఎంత మంది రైతులు, ఎన్ని ఎకరాలు, వాటి సర్వే నంబర్ తో సహా అవార్డ్​ పాస్ చేసేందుకు ఉన్న అడ్డంకులపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు.

ప్రజలకు తాగు నీరు, పరిశుభ్రత, వైద్య సదుపాయం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు అంబులెన్స్  సౌకర్యం కల్పిస్తే  అవసరమైన నిధులను అందిస్తామని, కలెక్టరేట్  నుంచి పెట్రోల్, లూబ్రికెంట్, డ్రైవర్  ఖర్చులు భరిస్తామని తెలిపారు. టీచర్ల కొరత తీర్చడంతో పాటు స్కూళ్లలో సౌలతులు కల్పించడంపై దృష్టి పెట్టాలన్నారు. పెండింగ్​లో ఉన్న సీసీ, బీటీ రోడ్ల పనులను కంప్లీట్​ చేయించాలని పీఆర్​ ఈఈని ఆదేశించారు. సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్లకు 60 సీ సెక్షన్  కింద నోటీసులు జారీ చేయాలన్నారు.

విద్యుత్  శాఖ అధికారులు, సిబ్బంది రైతులను ఇబ్బంది పెట్టవద్దని, అలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు. జిల్లాలో విత్తనాలు, ఎరువుల కొరత లేదని, ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు గుర్తిస్తే అధికారులకు ఫిర్యాదులు చేయాలని సూచించారు. చిన్నంబావి లిఫ్ట్, చెల్లంపాడు గ్రామంలో 700 ఎకరాలకు సాగు నీరందించేందుకు ఎదురవుతున్న సమస్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.