ఎమ్మెల్యే బండ్ల కాంగ్రెస్​లోనే ఉన్నడు : మంత్రి జూపల్లి కృష్ణారావు

  •     అసెంబ్లీ లాబీలో తెలిసిన వ్యక్తితో  మాట్లాడితే పార్టీ మారినట్టేనా..
  •     గద్వాల ఎమ్మెల్యేకు, పార్టీకి గ్యాప్​లేదు 
  •     కృష్ణమోహన్​రెడ్డి ఇంట్లో బ్రేక్​ఫాస్ట్​చేసి  అసెంబ్లీకి తీసుకువెళ్లిన మంత్రి జూపల్లి

 గద్వాల, వెలుగు : గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి మళ్లీ బీఆర్ఎస్​లోకి పోతున్నారన్న ప్రచారానికి మంత్రి జూపల్లి కృష్ణారావు బ్రేక్​ఫాస్ట్​తో బ్రేక్ ​వేశారు. ఎమ్మెల్యే ఎక్కడికీ వెళ్లలేదని కాంగ్రెస్ లోనే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. గురువారం ఉదయం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి గద్వాలలోని ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి అక్కడే బ్రేక్ ఫాస్ట్ చేశారు. తర్వాత మంత్రి జూపల్లి మాట్లాడుతూ..

ఎమ్మెల్యేకి జ్వరంగా ఉందంటే పరామర్శించడానికి వచ్చామని, ఎమ్మెల్యేకి, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి గ్యాప్ లేదన్నారు. ఆయన ప్రస్తుతం తమతోనే ఉన్నారని, తన వాహనంలోనే అసెంబ్లీకి తీసుకువెళ్తున్నట్టు చెప్పారు. అసెంబ్లీ లాబీలో తెలిసిన వ్యక్తితో మాట్లాడితే పార్టీలో చేరినట్టేనా అని ప్రశ్నించారు. కింది స్థాయిలోనో.. పై స్థాయిలోనో తెలిసో తెలియక తప్పులు జరగొచ్చని, వాటన్నింటిని పక్కనపెట్టి గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు.

గట్టు లిఫ్ట్ పనులతో పాటు, ర్యాలంపాడ్ రిజర్వాయర్ రిపేర్లపై దృష్టి పెడతామన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరికీ గౌరవం ఉంటుందన్నారు. తర్వాత గద్వాల, దేవరకద్ర ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి అసెంబ్లీ సమావేశాలకు హైదరాబాద్ వెళ్లారు. వెంట కాంగ్రెస్ లీడర్లు పటేల్ ప్రభాకర్ రెడ్డి, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.