దేశానికి దిక్సూచి రాహుల్ గాంధీ : జూపల్లి కృష్ణారావు

గద్వాల టౌన్/అలంపూర్/శాంతినగర్, వెలుగు: దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన చరిత్ర గాంధీ ఫ్యామిలీదని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఎర్రవల్లి చౌరస్తాలో షేక్ పల్లె రూట్ లో ఆదివారం ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు. ఈ సభలో మంత్రి మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్  జోడో యాత్రతో వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశాన్ని సంఘటిత శక్తిగా ఉంచారన్నారు. 

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్  పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. పాలమూరు ముద్దుబిడ్డ 57 ఏండ్ల తర్వాత రేవంత్ రెడ్డి సీఎం కావడం అదృష్టమని, పాలమూరు దశ దిశ మార్చి అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతారని చెప్పారు. పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్  పార్టీకి ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధానిని చేసేబాధ్యత అందరిపై ఉందన్నారు. 

నాగర్​కర్నూల్​ ఎంపీ క్యాండిడేట్​ మల్లు రవి మాట్లాడుతూ 13న జరిగే పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్  పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి  6 గ్యారంటీలు, రాహుల్ గాంధీ 5 గ్యారంటీలు 11 గ్యారెంటీలు ఇంటికి నడిచి రావాలంటే కాంగ్రెస్​ క్యాండిడేట్లను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, జడ్పీ చైర్​పర్సన్  సరిత తిరుపతయ్య, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, చిన్నారెడ్డి, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

సభ సక్సెస్ తో  క్యాడర్​లో ఫుల్ జోష్

నడిగడ్డలో కాంగ్రెస్  పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభ సక్సెస్  కావడం ఆ పార్టీ క్యాడర్ లో ఫుల్ జోష్  నింపింది. ఈ సభకు కాంగ్రెస్  అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఎండను సైతం లెక్క చేయకుండా నడిగడ్డలోని గ్రామాల నుంచి కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను సక్సెస్  చేయడంతో శ్రేణుల్లో జోష్​ నెలకొంది.

బండ్ల చంద్రశేఖర్ రెడ్డికి పరామర్శ..

ఇటీవల దాడిలో గాయపడ్డ కాంగ్రెస్  పార్టీ నాయకుడు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆరోగ్య విషయాలను రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. బహిరంగ సభకు వచ్చిన ఆయనను ప్రత్యేకంగా పిలిపించుకొని పరామర్శించారు.

భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన ఐజీపీ..

సీఎం సభ భద్రత ఏర్పాట్లను మల్టీజోన్–2 ఐజీపీ సుధీర్ బాబు, జోగులాంబ జోన్  ఐజీ చౌహాన్, ఎస్పీ రితిరాజ్ పర్యవేక్షించారు. సీఎం, రాహుల్ సభకు రాకముందే బాంబు స్క్వాడ్  తనిఖీలు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను పర్యవేక్షించారు.