పర్యాటక ప్రాంతంగా సరళ సాగర్ ప్రాజెక్ట్: మంత్రి జూపల్లి కృష్ణారావు

మదనాపురం, వెలుగు: దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం మండలంలోని సరళ సాగర్  ప్రాజెక్ట్​ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. టూరిజం స్టడీ టూర్​లో భాగంగా ఆదివారం దేవరకద్ర​ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఎంపీ మల్లు రవితో కలిసి సరళ సాగర్ ప్రాజెక్ట్​ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, చారిత్రాత్మక, వారసత్వ సంపద మన సొంతమని చెప్పారు.

 పదేండ్లుగా బీఆర్ఎస్  ప్రభుత్వం పర్యాటకరంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్యంలో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. ఉమ్మడి పాలమూరులో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణం తదితర అంశాలపై అధ్యయనం చేస్తామని చెప్పారు. ఆసియా ఖండంలోనే రెండోదైన ఆటోమేటిక్  సైఫన్  సిస్టం కలిగిన సరళా సాగర్  ప్రాజెక్ట్​ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. మక్తల్, షాద్​నగర్, అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్​కర్నూల్, జడ్చర్ల, వనపర్తి ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, వీరపల్లి శంకర్, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, రాకేశ్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, మేఘారెడ్డి, సీడబ్ల్యూసీ మెంబర్  వంశీచంద్​రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, అడిషనల్​ కలెక్టర్  నాగేశ్  పాల్గొన్నారు.

చిన్న చింతకుంట: టూరిజం స్టడీ టూర్ లో భాగంగా ఆదివారం కురుమూర్తి స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆత్మకూరు సంస్థనాధీశుడు రాజ శ్రీరామ భూపాల్, కురుమూర్తి ఆలయ అధికారులతో సమావేశమయ్యారు. ఆలయ అభివృద్ధిపై చర్చించారు. అనంతరం కోయిల్ సాగర్  ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్ట్​ వద్ద పర్యాటకరంగాన్ని ఎలా డెవలప్​ చేయాలనే విషయాన్ని పరిశీలిస్తున్నామని, సీఎంతో చర్చించి నిధులు తెస్తామని తెలిపారు. కురుమూర్తి ఆలయ అభివృద్ధిపై  ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇదిలాఉంటే పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐఎఫ్టీయూ నాయకులు దేవదానం, సాంబశివుడు కార్మికులతో కలిసి మంత్రికి వినతిపత్రం అందజేశారు.ఈఐస్ఐ, పీఎఫ్, పీఆర్సీ అమలు చేయాలని కోరారు.