ప్రతి ఎకరానికి సాగునీటిని అందిస్తాం : జూపల్లి కృష్ణారావు

కందనూలు, వెలుగు: జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీటిని అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం గుడిపల్లిగట్టు బ్యాలెన్సింగ్  రిజర్వాయర్  నుంచి ఆయకట్టుకు బుధవారం మోటార్లకు పూజలు చేసి నీటిని విడుదల చేశారు. కల్వకుర్తి ప్రాజెక్ట్​ పరిధిలోని 3.65 లక్షల ఎకరాల ఆయకట్టులో మూడింట రెండు వంతులకు పైగా గుడిపల్లిగట్టు రిజర్వాయర్ నుంచి నీరు అందుతోంది. రిజర్వాయర్  నుంచి నాగర్ కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట ప్రధాన కాల్వలకు కలెక్టర్  బదావత్  సంతోష్, ఎమ్మెల్యేలు రాజేశ్ రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డితో  కలిసి నీటిని విడుదల చేశారు.

ప్రతిరోజు 650 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు ఇంజనీరింగ్  అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూల్  నియోజకవర్గ రైతులకు రెండు పంటలకు సాగునీటిని  అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సీఎం ఇటీవల ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల రివ్యూ మీటింగ్​లో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారని చెప్పారు. అంతకుముందు ఇంజనీరింగ్  అధికారులతో మంత్రి సమావేశమై నీటి లభ్యత, విద్యుత్ వినియోగం తదితర అంశాలపై చర్చించారు. ఎస్ఈ సత్యనారాయణ రెడ్డి, ఈఈ రవీందర్, ఎస్వీఎన్  కంపెనీ ఎండీ శ్రీనివాస్ రెడ్డి 
పాల్గొన్నారు.