యాత్రికులను ఆకట్టుకునేలా నల్లమల అభివృద్ధి : జూపల్లి కృష్ణారావు

అచ్చంపేట/అమ్రాబాద్, వెలుగు: యాత్రికులను ఆకర్షించేలా నల్లమలను టూరిజం స్పాట్​గా డెవలప్​ చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నల్లమలలోని పర్యాటక ప్రాంతాలను గుర్తించేందుకు రాష్ట్ర  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి నల్లమలలో పర్యటించారు. శుక్రవారం అచ్చంపేట పట్టణంలోని క్యాంప్​ ఆఫీస్​ నుంచి బయలుదేరిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఉమామహేశ్వరం ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.

వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఉమామహేశ్వర ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ మొదటి విడతగా రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయం ముందు భాగంలో ఎక్స్​టెన్షన్​ చేయడంతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. శ్రీశైలం వెళ్లే భక్తులు ఉమామహేశ్వరం వచ్చేలా ప్రధాన రహదారిపై బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. రెండు రోజులపాటు నల్లమలలో పర్యటించి పురాతన ఆలయాలతో పాటు టూరిజం పరంగా అభివృద్ధి చేసే ప్రాంతాలను పరిశీలిస్తామని చెప్పారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా డెవలప్​ చేసి ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.

అనంతరం రంగాపూర్  నిరంజన్ షావలి దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, మేఘా రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వాకిటి శ్రీహరి, మధుసూదన్ రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాశ్ రెడ్డి, పురావస్తు శాఖ  డైరెక్టర్  భారతి హోళికేరి, పర్యటకశాఖ డైరెక్టర్  ఇలా త్రిపాఠి, కలెక్టర్  బదావత్  సంతోష్, ఎస్పీ వైభవ్  గైక్వాడ్, డీఎఫ్ వో రోహిత్ గోపిడి పాల్గొన్నారు. ఇదిలాఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లతో పాటు కాంగ్రెస్​ నేతలను అనమతించిన ఆఫీసర్లు.. మీడియాకు మాత్రం పర్మిషన్​ ఇవ్వకపోవడం గమనార్హం.